పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

11

తుర్పు చాళుక్యులే వేగీ దేశాన్ని పరిపాలించారు. కుబ్జ విష్ణువర్ధనుడు వీరి మూల పురుషుడు. ఇతడు రెండవ పులకేశి తమ్ముడు.

తూర్పు చాళుక్యులు (క్రీ.శ. 625_1077_1118):

వీరు చేసిన భాషా సేవ అపారమైనది. వీరి వరకు తెలుగు ప్రజాభాషేగాని, రాజభాష కాదు. వీరు తెలుగును రాజభాషగా చేశారు. పండిత పరిషత్తులు స్థాపించి, తెలుగును అభివృద్ధిలోకి తెచ్చారు. వీరి కృషి ఫలితంగానే, రాజరాజనరేంద్రుడి కాలంలో, ఆంధ్రమహాభారతం అవతరించింది.

వెలనాటి చోడులు - తెలుగు చోడవంశాలు (క్రీ.శ. 1108_1206):

రేపల్లె తాలూకాలోని చందవోలు లేక ధనదపురము రాజధానిగా, వెలనాటి చోడులు, కృష్ణానదికి దక్షిణాన ఉన్న భాగాన్ని పరిపాలించారు. దీన్ని ఆ కాలంలో వెలనాడు అనేవారు. ఇంచుమించుగా నేటి గుంటూరు మండలానికి అది సరిపోతుంది. వీరి కాలంలో బౌద్ధమతానికి కొంత స్థానం ఉండేది. కాని, వీరశైవమత విజృంభణకు అది తట్టుకోలేక పోయింది. సుప్రసిద్ధుడైన మల్లికార్జున పండితుడు వీరి ఆస్థానానికి వెళ్ళిన నిదర్శనాలున్నాయి.

తెలుగు చోడులు అనబడేవారు కృష్ణానదికి దక్షిణాన, మాండలిక రాజులై, చిన్న చిన్న రాజ్యాల్ని పరిపాలించేవారు. వీరు, అనేక కుటుంబాలకు చెందినవారు. వీరిలో రేనాడు, పొత్తపినాడు, కొణిదెవ, నెల్లూరు ప్రదేశాలను పరిపాలించినవారు చాల ప్రసిద్ధులు. తెలుగులో మొట్టమొదట శాసనాలు వేయించిన కీర్తి రేనాటి చోడులకే చెందుతుంది. సుప్రసిద్ధాంధ్రకవి నన్నెచోడుడు పొత్తపినాటి చోడ వంశానికి చెందినవాడని కొందరు పరిశోధకుల అభిప్రాయం. తిక్కన నిర్వచనోత్తర రామాయణ కృతిభర్త మనుమసిద్ధి నెల్లూరు శాఖకు చెందినవాడు. దీనినే విక్రమ సింహపురచోడ శాఖ అని అంటారు. వీరు మధురాంతక పొత్తపి చోడ శాఖకు చెందినవారు.

కాకతీయులు (క్రీ.శ. 625_1000_1323):

వీరి రాజధాని ఓరుగల్లు దీని సంస్కృతీకరణం ఏకశిలానగరం. దీన్ని ఆంధ్రనగరం అనికూడా అనేవారు. కాకతి అనే దేవతను ఆరాధించడంచేత, వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందనీ కొందరి అభిప్రాయం. ఈ దేవత అనుగ్రహంవల్ల గుమ్మడి తీగకు వీరి మూలపురుషుడు పుట్టేడట. కాకతి జైన దేవత అన్నారు కొందరు. ఆమె దుర్గ అన్నాడు విద్యానాథుడు. వీరి మూలపురుషుడైన చేతరాజు ముఖ్యపట్టణం కాకతిపురం అని కాజూపేట శాసనం చెబుతుంది. కాకతీయులు మొదట జైనులైనా, తరువాత శైవులుగా మారినట్లు కనబడుతుంది. ఆనాడు శైవుల