పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
10

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

ప్రాయం. త్రిలింగ, త్రినగ శబ్దాల నుంచి, తెలుగు తెనుగు పదాలు నిష్పన్నమైనాయి అని చెప్పే పండిత నిర్వచనం కృతకం.

బౌద్ధ యుగంలో, ఈ దేశంలోని వివిధ భాగాల్ని వివిధ నామాలతో వ్యవహరించేవారు. ఇప్పటి తెలంగాణా ప్రదేశాన్ని మంజీర దేశం అనీ, కృష్ణానదీప్రాంతాన్ని నాగభూమి అనీ, వజ్రదేశం అనీ పిలిచేవారు. మెగస్తనీస్ వ్రాతలలో, బహు పరాక్రమాఢ్యులుగా ఆంధ్రులు వర్ణింపబడి ఉన్నారు. ఈ ఆంధ్ర రాజ్యాన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారు అన్న ప్రశ్నలకి చారిత్రకంగా సమాధానం చెప్పడం కష్టం. ఏది ఎలాగున్నా, క్రీ.పూ. నాల్గవ శతాబ్దికి ఆంధ్రరాజ్యం అంత మహోన్నతదశకు వచ్చిందంటే, ఆ రాజ్య స్థాపన జరిగి అప్పటికి ఒక నూరేళ్లయినా అయి ఉండాలి. కాబట్టి క్రీ.పూ. ఐదవ శతాబ్దిలో ఆంధ్ర రాజ్యస్థాపన జరిగి ఉండవచ్చు. అప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజవంశం ఏదో మనకు తెలియదు. మౌర్య సాంరాజ్య పతనానంతరం ఆంధ్రులు స్వతంత్రులయినారు.

శాతవాహనుల కాలం నుంచే మనకు ఆంధ్రదేశ చరిత్ర స్పష్టంగా కనబడుతుంది. ఇంచుమించుగా 450 సంవత్సరాలు శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు (క్రీ.పూ. 225 - క్రీ.శ. 225). క్రీ.శ. 225 నుంచి 625 వరకు, ఆంధ్రదేశాన్ని అనేక రాజవంశాలవారు, భిన్న స్థలాల్లో పరిపాలించారు. 1. ఇక్ష్వాకులు: వీర్ చరిత్రకు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి శాసనాలు ఆధారములు. వీరి శాసనాలు ప్రాకృతంలోనే ఉన్నాయి. 2. పల్లవులు (మొదటి): వీరి శాసనాలు మొదట ప్రాకృతంలో తరువాత సంస్కృతంలో ఉన్నాయి. పల్లవులు ఆంధ్రులే అని కొందరి వాదం. 3. బృహత్పలాయనులు: వీరు కృష్ణానది ఉత్తరతటి ప్రదేశాన్ని పరిపాలించారు. ఇంతవరకు వీరి శాసనం ఒక్కటే లభించింది. అది కొండముది శాసన్ం; జయవర్మ మహారాజుది. 4. ఆనందగోత్రీకులు: కృష్ణానదీ దక్షిణ ప్రదేశాన్ని పరిపాలించారు. 5. శాలం కాయనులు: కృష్ణా గోదావరీ మధ్య ప్రదేశంలో కొంత భాగాన్ని పరిపాలించారు. వీరందరూ తమ గోత్రాన్నే కాని కులాన్ని చెప్పుకోలేదు. 6. విష్ణుకుండినులు: వీరు శ్రీపర్వతస్వామి పాదానుధ్యాతులు. వైదిక మార్గ నిరతులు. వీరిలో మాధవవర్మ నామధేయులు ముగ్గురున్నట్లు కనబడుతుంది. వీరిలో మూడవ మాథవవర్మను గురించి చాల గాథలున్నాయి. ఈయన పదకొండు అశ్వమేథయాగాలు, ఒక వేయి అగ్నిష్టోమాలు చేసాడట. దీన్నిబట్టి ఆనాడు వైదికమతం ఎంతగా విజృంభించిందో మనకు తెలుస్తుంది. నేడు క్షత్రియులుగా పరిగణింపబడుతూ ఉన్న, పూనపాటివారు మొదలైనవారు, మాధవవర్మనే అమ మూల పురుషుడుగా చెప్పుకుంటారు. క్రీ.శ. 624లో, చాళుక్యరాజు రెండవ పులకేశి మాధవవర్మను జయించాడు. అంతతో వీరి రాజ్యం అంతరించింది. చాళుక్యుల్లో,