పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

9

కారుడికి పనికివస్తుంది. సాంస్కృతికచరిత్ర రచనకు ముఖ్యంగా ఉపకరించేది జానపద సాహిత్యం. దురదృష్టవశాత్తు పండితకవుల నిరసనభావంవల్ల చాలకాలం అది అనాదృతంగా ఉండిపోయింది. ఇటీవల అందులో మంచి కృషి జరుగుతున్నది. వసుచరిత్రాది ప్రబంధాలవల్ల మనకు తెలిసే సాంఘికచరిత్ర చాల స్వల్పం. కదరీపతి శుకసప్తతి మొదలయిన ప్రబంధాలే మన కందుకు బాగా ఉపకరిస్తాయి. పాల్కురికి సోమనాధాది స్వతంత్రకవులు రచించిన గ్రంథాల్లో జానపదజీవితం మనకెంతో స్పష్టంగా గోచరిస్తుంది. నన్నయాదుల గ్రంథాలు అంతగా ఉపకరించవు. స్థానిక చరిత్రలు (కైఫీయతలు) విదేశీయుల వ్రాతలు ఉపయోగపడతాయి గాని, వాటి పరిశీలనలో సాంస్కృతిక చరిత్రకారుడు, చాల జాగరూకతవహించవలసి ఉంటుంది. ఆ వ్రాతల్లో పుక్కిటి పురాణాలు, అత్యుక్తులు సకృత్తుగా అబద్ధాలు కూడా ఉంటాయి. వాటిని పరిహరించుకుంటూ పరిశీలిస్తే నిజం బయటపడుతుంది. దేశచరిత్ర వ్రాయడంకంటె సాంస్కృతికచరిత్ర వ్రాయడం కష్టతరం.

ఆంధ్రుల చరిత్ర

ఆంధ్రుల దేశచరిత్రనుగురించి సంక్షేపంగా చెప్పడానికి కూడా ఈ చిన్న వ్యాసంలో అవకాశళ్ లేదు. అయినా స్థూలంగా కొన్ని ముఖ్య విషయాలు మాత్రం తెలుసుకోవచ్చు. బౌద్ధయుగానికి పూర్వం భారతదేశచరిత్ర స్పష్టంగా, నిర్ధిష్టంగా కనబడదు. అటువంటి పరిస్థితిలో ప్రాచీనకాలంలోని ఆంధ్రదేశచరిత్ర ఎంత దృశ్యాదృశ్యంగా ఉంటుందో, వేరే చెప్పవలసిన పనిలేదు. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర శబ్దం ఉంది. అక్కడ అది జాతి పరంగా వాడ బడ్డది. రామాయణ కాలంలో, ఈ ఆంధ్ర దేశం చాల వరకు దండకాటవి. మహా భారత కాలానికి ఆంధ్రులు దక్షిణా పథంలో నివసిస్తున్నట్లు కనబడుతుంది. ఆంధ్రానికి పర్యాయపదాలుగా, నేడు తెలుగు, తెనుగు అనే పదాలు వాడబడుతున్నాయి. తెలుగు (తెలుంగు, తెలింగ) రూపమే మొదటిదని మల్ల్ంపల్లివారి అభిప్రాయం. ఈ పదానికి వ్యుత్పత్తిగాని, అది జాతి వాచకంగా మొదట ప్రయుక్తమయిందా, భాషా వాచకంగా ప్రయుక్తమయిందా? అన్న ప్రశ్నలకి సమాధానంగాని, ఇదమిత్థంగా, సప్రమాణంగా, చెప్పడానికి ఆధారాలు లేవని, వారే చెప్పి ఉన్నారు. అసలు ఆంధ్రులూ తెలుగువారూ ఒకరౌనా కాదా? అన్న ప్రశ్నకి కూడా స్పష్టమైన సమాధానం లేదు. ఆంధ్రులు ఔత్తరాహులని కొందరి అభిప్రాయం. మన పురాణ గాథల్నిబట్టి చూస్తే ఆంధ్రులు ఔత్తరాహులుగానే కనబడతారు. నన్నయ నన్నెచోడులికి పూర్వం. తెనుగు పదం వాడుకలో ఉన్నట్టు కనబడదు. నన్నయ కాలంలోనే తెనుగునకు రూపాంతరంగా తెలుగు ప్రయుక్తమై ఉంది. ఆంధ్ర పదమే ప్రాచీన మయినదని, ఆంధ్ర పదం అర్వాచీనమనీ, చారిత్రకుల నిశ్చితాభి