పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెంచడంవలన మన రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. నియోజకవర్గ స్థాయిలో మిగిలిన 75 వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు మరియు జిల్లా స్థాయిలో మరో 11 పరీక్షా కేంద్రాలు 2023 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాల కోసం 36.39 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

20. వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడం మా ప్రభుత్వం చేపట్టే పథకాలలో ముఖ్యమైన లక్ష్యం. డాక్టర్ వై.ఎస్.ఆర్. పొలం బడి కార్యక్రమం ద్వారా పర్యావరణ అనుకూల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, సాగు ఖర్చు తగ్గిస్తూ, పంట దిగుబడులను పెంచడం కోసం మా ప్రభుత్వం సమగ్ర పంట నిర్వహణ పద్ధతులతో రైతులకు సాధికారత కల్పిస్తోంది. దీని కోసం 2021-22 ఆర్థిక సం॥లో 16,123 పొలం బడి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వివిధ పంటల విషయంలో సాగు ఖర్చు 21 శాతం తగ్గి మరియు దిగుబడి 23 శాతానికి పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17,000 పొలం బడి కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

21. ఇ-క్రాప్ మరియు ఇ-కె.వై.సి. తర్వాత గుర్తించబడిన ప్రాంతాలలో, గుర్తించబడిన పంటలు పండించే రైతులందరికీ స్వయంచాలకంగా అమలు అయ్యేలా 2019 ఖరీఫ్ కాలం నుండి మా ప్రభుత్వం డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పారదర్శకంగా, విశిష్టంగా మరియు సమర్థవంతంగా అందరికీ వర్తింపు హామీనిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో మన రాష్ట్రం మాత్రమే కావడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి బీమా పరిహారముగా మొత్తం 6,872 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదలీ విధానం ద్వారా 44.55 లక్షల మంది రైతులకు వారి వారి ఖాతాలకు జమచేయడమైనది. వీటిలో గత ప్రభుత్వ బకాయిలు కూడా ఉన్నాయి. 55 లక్షల హెక్టార్ల పై చిలుకు భూమికి సంబంధించి ప్రకటించిన విస్తీర్ణంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డా॥ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకానికి 1,600 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

8