పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూమిని సేద్యం చేస్తున్న (ఆర్.ఓ.ఎఫ్.ఆర్.) గిరిజన రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సహాయంగా 13,500 రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా అందించబడుతున్నాయి. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ప్రత్యక్ష నగదు బదలీ విధానం ద్వారా 27,063 కోట్ల రూపాయలను అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ పథకం క్రింద 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4,020 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ప్రతీ వస్తువును రిటైల్ గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని హోల్సేలే అమ్మేవాడే రైతు' అంటాడు జాన్.ఎఫ్. కెన్నడీ. ఇప్పటికీ ఇది చేదు వాస్తవం.

18. రైతులకు ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే నాణ్యమైన వస్తువులు మరియు పరికరాలు సరఫరా మొదలుకొని గ్రామస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వరకు డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 లక్షల మంది రైతులకు 187 కోట్ల రూపాయల విలువైన సుమారు 7 లక్షల క్వింటాళ్ల నాణ్యత ధృవీకరించబడిన మరియు సబ్సిడీతో కూడిన పంట విత్తనాలు మా ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడ్డాయి. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ అయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (F.A.O.), నీతి ఆయోగ్ మరియు భారత రిజర్వు బ్యాంకు - ఈ మూడు సంస్థలు మన రైతు భరోసా కేంద్రాల పనితనాన్ని ఎంతో ప్రశంసించి వాటి అవసరాన్ని గుర్తించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను మిగిలిన 7,578 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి 40.46 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

19. వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువుల మరియు పరికరాల నాణ్యతా పరీక్షల కోసం 72 వై.ఎస్.ఆర్. వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలను మా ప్రభుత్వం జూలై 8, 2021 న ప్రారంభించింది. ఈ పరీక్షా కేంద్రాలు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను మరియు భూసార పరీక్ష ఫలితాలను రైతులకు సకాలంలో అందజేస్తూ ఉండంవలన వారు తమతమ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని వ్యవసాయ ఉత్పాదకతను

7