పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి

12. 2018-19 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధికి సంబంధించి స్థిరమైన ధరలలో మన రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉంది. మా ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల కారణంగా, పెట్టుబడి మరియు వినియోగం రెండింటినీ అనుసంధానిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోభివృద్ధిని పొందింది. ఫలితంగా, మన రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను స్థిరమైన ధరలతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధి పరంగా దేశంలో 1వ స్థానంలో ఉంటూ గుర్తించదగిన వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మన ప్రభుత్వం అందించిన మద్దతు రాష్ట్ర ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధించడంలో ప్రభావవంతంగా పనిచేసిందని, గత ఐదేళ్ళలో అత్యధిక వృద్ధిరేటును నమోదు చేయడానికి వీలుకల్పించిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితులలో సైతం మా ప్రభుత్వం తన లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధి అవకాశాలకు కూడా ప్రాధాన్యతనిచ్చి పరిరక్షించిందని ఈ గణాంకాలు చూపుతున్నాయి.

13. 2022-23 ఆర్థిక సంవత్సరములో సవరించిన అంచనాల ప్రకారము రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13,17,728 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరములో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14,49,501 కోట్ల రూపాయలతో 10 శాతము వృద్ధిగా అంచనా వేయబడినది.

14. నవరత్నాలు మరియు మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ఏకీభవిస్తున్నాయి. ఇవి (ఎ) జీవనోపాధి, (బి) సామర్థ్య అభివృద్ధి మరియు సాధికారత, (సి) సామాజిక భద్రత మరియు (డి) మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి అనే నాలుగు అంశాల ద్వారా వివరించబడ్డాయి.

15. నేను ఈ నాలుగు అంశాల ద్వారా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానం చేస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంనకు బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.

5