పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి.

98. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

నీటి వనరులు

'నీరము తప్త లోహమున నిల్చి' అనే భర్తృహరి సుభాషితం ఈ విధంగా చెబుతుంది.

వర్షపు చినుకు యొక్క భవిష్యత్తు అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది.

సలసలా కాలుతున్న ఇనుము మీద నీటిచుక్క పడితే అది క్షణాలలో ఆవిరి అవుతుంది.

అదే నీటి బిందువు తామర అకుమీద పడితే తళతళ మెరుస్తుంది.

అదే అల్చిప్పలో పడితే ముత్యమై మిగులుతుంది.

రైతన్నల పొలాలలో పడితే మొక్కలుగా మొలచి ప్రజల ప్రాణమై నిలుస్తుంది.

99. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ మరియు నెల్లూరు బ్యారేజీలను పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్ మరియు కనుపూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పెన్నా నది మీద పనులను సెప్టెంబర్ 6, 2022 న ప్రారంభించారు.

100. కర్నూలు మరియు నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతంలో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు మరియు త్రాగునీరు అందుబాటులోకి వస్తూ ప్రజల చిరకాలస్వప్నం నెరవేరనున్నది.

101. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్ట మరియు కాలువ పనులు 79.07 శాతం పూర్తయ్యాయి.

33