పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.ఎస్.ఆర్. లా నేస్తం

83. క్రొత్తగా పట్టభద్రులైన న్యాయవాదులకు వారి వృత్తి యొక్క ప్రారంభ కాలంలో ఆర్థిక మద్దతు క్రింద జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందజేస్తున్నాము. వై.ఎస్.ఆర్. లా నేస్తం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్

84. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూలు కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు, షెడ్యూలు తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

కాపు సామాజిక వర్గం మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం

85. కాపు సామాజిక వర్గానికి వివిధ సంక్షేమ కార్యక్రమాల క్రింద ప్రతి సంవత్సరం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి 4,887 కోట్ల రూపాయలు మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,203 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

డి. మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి

గృహ నిర్మాణం

86. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18.63 లక్షల ఇండ్లకు గాను, మొదటి దశలో 16.91 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభంకాగా, వీటిలో 4.4 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది.

29