పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫుట్ పాత్ పునరుద్ధరణ, కొత్త బీచ్ స్ట్రెచ్ అభివృద్ధి మరియు బీచ్లను పరిశుభ్రం చేయడం ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచబడ్డాయి. మౌలిక వసతులను ఒక ఆస్తి విలువగా అభివృద్ధి చేయడం, నాణ్యమైన మౌలిక సదుపాయల మదుపును ప్రోత్సహించడం, ఇన్ఫ్రా-టెక్, మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం మదుపు కొరకు ఆర్థిక వనరులను సమీకరించే వినూత్న సాధనాలను గుర్తించడం వంటి వివిధ అంశాలలో నిమగ్నమవ్వడానికి జి-20 సమావేశం మాకు మరో అవకాశాన్ని అందిస్తుంది.

62. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధికి 9,381 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ

మనం పనిచేస్తున్న విధానానికి;

అదే పనిని చేయగల సామర్థ్యానికి గల తేడాను అధిగమించగలిగితే,

ప్రపంచంలో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించగలము.

-మహాత్మా గాందీ

63. నేటి పోటీ ప్రపంచంలో యువత అభివృద్ధి చెందాలంటే సరైన నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఎంతో అవసరం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రానికి క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ మోడల్ ను రూపొందించారు. ఈ వ్యవస్థలో రాష్ట్ర స్థాయిలో నైపుణ్య విశ్వవిద్యాలయం, జిల్లా స్థాయిలో నైపుణ్య కళాశాలలు మరియు నియోజక వర్గ స్థాయిలో నైపుణ్య కేంద్రాలు ఉంటాయి. ఇవి అభ్యర్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలు మరియు ప్రత్యేకతలను అందించడంలో భాగస్వాములుగా ఉంటూ, పాఠ్యాంశాలను రూపొందించడం, నిర్వహించడం మరియు ఉద్యోగ అవకాశాలను అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 21 జిల్లాలలో 21 నైపుణ్య కళాశాలలు, 175 అసెంబ్లీ నియోజిక వర్గాలలో 192 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

22