పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్ని రంగాలను 2014 నుండి పునఃప్రారంభించ వలసిన పరిస్థితి ఏర్పడింది. విభజన సవాళ్లతో సతమతమవుతూ కోవిడ్-19 మహమ్మారితో సాహసోపేతమైన పోరాటం చేయవలసి వచ్చింది. అయితే ఒక ప్రక్క ప్రపంచ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, జీవనానికి రక్షణ వలయాన్ని నిర్మించుకుంటూ, మరొక ప్రక్క రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగించాము. ఈ సంక్షోభ సమయంలో కూడా ఆరోగ్య సంరక్షణ నుండి సుస్థిరాభివృద్ధి వరకు అన్ని రంగాలలోని ప్రతికూలతలను అధిగమించాం. తద్వారా ఈ సంక్షోభాన్ని కూడా ప్రజల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకొచ్చి యథాస్థితికి చేరుకునే ఒక అవకాశంగా మా ప్రభుత్వం మార్చుకుంది.

4. కోవిడ్ మహమ్మారి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యత పొందిన అంశాలు రెండు. అవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు సుపరిపాలన. ఇవి రెండూ పరస్పర సంబంధం మరియు సార్వత్రిక ఆకాంక్షలు.

5. 'సుస్థిరత' జీవితానికి మార్గదర్శక సూత్రంగా, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (S.D.G. లు) సాధనకు బలమైన రాజకీయ నాయకత్వం, మంచి విధానాలు, సమర్థవంతమైన సంస్థలు మరియు ఫలితాల ఆధారిత పాలనపై ఆధారపడి ఉంటుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. 'సుస్థిర అభివృద్ధి' జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత మరియు సమాన అవకాశాలతో కూడిన సుపరిపాలనకు దారితీస్తుంది. అదేవిధంగా స్థిరమైన అభివృద్ధి సాధించడానికి సుపరిపాలన అవసరం. ఈ లక్ష్యాల నిజమైన అమలుకు బలమైన సంస్థలే పునాది రాళ్ళు. మా ప్రభుత్వం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తోంది.

6. దూరదృష్టి గల నాయకత్వం, సమర్థ పరిపాలన మరియు ఖచ్చితమైన నిర్వహణతో కూడిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కీలకమైనవి. ఈ సందర్భంలో ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ప్రసిద్ధ కవిత 'If–' నుండి రెండు పంక్తులను గుర్తుచేస్తున్నాను.

2