పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగనన్న విద్యా కానుక

51. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరచడానికి మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, యూనిఫామ్ లు, బూట్లు, సాక్స్లు, పాఠ్య పుస్తకములు, వర్క్ బుక్ లు, స్కూల్ బెల్ట్ మరియు మాస్క్ ల సెట్లతో కూడిన 'టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్' ను విద్యార్థి కిట్ల రూపంలో ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ పథకం క్రింద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూర్చేందుకుగాను మా ప్రభుత్వం ఇప్పటివరకు 2,368 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక పథకం కోసం 560 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

విద్య మాత్రమే మానవాళికి జీవనాడి. విద్య వలన ఆత్మ విశ్వాసం మెరుగుపడుతుంది.

ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారితీస్తుంది అన్నారు.

-స్వామి వివేకానంద

52. పాలిటెక్నిక్, ఐ.టి.ఐ., ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ మరియు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది. జగనన్న వసతి దీవెన పథకం క్రింద ఉన్నత విద్యలో స్థూల హాజరు నమోదు నిష్పత్తిని మెరుగుపరిచే లక్ష్యంతో విద్యార్థుల ఆహారం మరియు వసతి గృహాల ఖర్చులను భరిస్తుంది. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, కాపు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దివ్యాంగుల వర్గాల విద్యార్థులందరికీ ఈ పథకాలను అమలు చేస్తున్నాము. 2019 సంవత్సరం నుండి మా ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 9,249 కోట్ల రూపాయలను రీయింబర్స్మెంట్ చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన పథకం క్రింద 3,366 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన పథకం నకు 2,841 కోట్ల రూపాయలను మరియు జగనన్న వసతి దీవెన పథకం నకు 2,200 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

19