పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్దిష్టమైన తరగతి అభ్యాస ఫలితాలను నిర్ధారించడానికి గాను డిజిటల్ కంటెంట్ ను ఉపయోగించి మిశ్రమ అభ్యాసాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు మరియు విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సి.బి.ఎస్.ఇ.) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసింది.

జగనన్న అమ్మ ఒడి

49. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా మా ప్రభుత్వం చూస్తున్నది. ఈ పథకం క్రింద, 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 44 లక్షల 50 వేల మంది తల్లులకు మరియు 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సుమారు 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న అమ్మ ఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

50. అదేవిధంగా, మన బడి నాడు నేడు కార్యక్రమం క్రింద, 15,715 పాఠశాలలలో అదనపు తరగతి గదులు, సురక్షిత త్రాగునీరు, పెద్ద మరియు చిన్నచిన్న మరమత్తు పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్దీకరణ, పెయింటింగ్, ఫర్నిచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్ లు మరియు వంట శాలలు అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరించబడ్డాయి. ఈ కార్యక్రమము క్రింద మొదటి మరియు రెండవ దశలలో మొత్తము 22,344 పాఠశాలలలో పనులు చేపట్టబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మన బడి నాడు-నేడు కార్యక్రమం కోసం 3,500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

18