పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45. మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్ఞావల' మరియు 'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవా గృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం క్రింద రాష్ట్ర కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

46. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి మరియు పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

విద్య

'అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది,

సృజనాత్మకత ఆలోచనకు దారి తీస్తుంది,

ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది,

జ్ఞానం నిన్ను గొప్పవానిగా చేస్తుంది'

-ఎ.పి.జె. అబ్దుల్ కలాం

'వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదు; నేర్చుకున్నవారే దాన్ని ఇతరులకు నేర్పించగలరు' అన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం,మా ప్రభుత్వం.

47. మన ప్రభుత్వం మన బడి నాడు నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టి.ఎమ్.ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి (ఎస్.ఎమ్.ఎఫ్) మరియు సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను మరియు విధి-విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలలో విద్యను మెరుగుపరచి మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.

17