పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16. 5వ ఎస్.డి.జి. అయిన 'లింగ సమానత్వం' తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంతో కూడిన చారిత్రాత్మక లింగ అసమానతలను సరిదిద్దవలసిన ఆవశ్యకతను సూచిస్తుంది. ఈ రెండింటినీ అనగా మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత మరియు వ్యక్తిగత గౌరవంతో కూడిన కుటుంబ ఉన్నతిని తీసుకు వస్తుందనే నమ్మకానికి మన ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉంది. మన ప్రభుత్వం యొక్క వై.ఎస్.ఆర్. ఆసరా మరియు వై.ఎస్.ఆర్. చేయూత కార్యక్రమాలు మరియు స్వయం సహాయక బృందాలలోని మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి మూలధనాన్ని సమకూర్చడంలో ముందుంటాయి. తద్వారా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 35.5% కంటే తప్పకుండా పెంచుతాయి కూడా. చివరగా, వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం, వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం, వై.ఎస్.ఆర్. వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు మరియు వై.ఎస్.ఆర్. లా నేస్తం కార్యక్రమాలు నిర్దిష్ట వృత్తి వర్గాలకు జీవనోపాధిని అందిస్తాయి.

17. డిజిటల్ మరియు రవాణా వ్యవస్థల అనుసంధానం అనేది ఆర్థిక వృద్ధికి పునాదిగా ఉంటుంది. భారత ప్రభుత్వ మద్దతుతో, రహదారుల నిర్మాణం మరియు గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అందుబాటులోకి తీసుకు వెళ్లడం కోసం మన ప్రభుత్వం భారీ కార్యక్రమాలను ప్రారంభించింది.

సామాజిక భద్రత

18. నాల్గవ మరియు చివరి మూల స్తంభం - 'సామాజిక భద్రత'. ఇది 'అసమానతలను తగ్గించడం' మరియు 'ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించడం' అనే ఎస్.డి.జి.లను కలిగి ఉంటుంది.

19. చివరి మూల స్తంభం అయిన 'సామాజిక భద్రత' లోని భాగమైన వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద వివిధ అణగారిన మరియు బలహీన వర్గాలకు మన ప్రభుత్వం విస్తృతమైన సామాజిక భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాదాపు 61.74 లక్షల మంది పింఛనుదారులకు నెలకు 2,500 రూపాయలు చొప్పున పింఛను అందిస్తోంది. ఇది వృద్ధాప్య పింఛనుదారులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, A.R.T. చికిత్స తీసుకునే HIV వ్యాధిగ్రస్తులకు మరియు సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి అందించే అత్యంత ప్రగతిశీల భద్రతా కార్యక్రమం. అంతేకాకుండా, వికలాంగుల, ట్రాన్స్ జెండర్ల, డప్పు కళాకారుల మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల గౌరవప్రదమైన జీవితానికి భరోసా ఇవ్వడానికి మెరుగైన పింఛన్లను కూడా మన ప్రభుత్వం అందిస్తోంది.

20. ప్రపంచ బ్యాంకు మరియు అభిజిత్ బెనర్జీ మరియు ఎస్తేర్ డుప్లో వంటి ప్రఖ్యాత ఆర్థికవేత్తలు సూచించిన విధంగానే, కరోనా మహమ్మారి సమయంలో కూడా మన ప్రభుత్వం రాష్ట్ర పేదలకు నగదు బదిలీలను అందించింది. ఈ నగదు బదిలీ విధానం అర్థవంతమైన ప్రభావాన్ని చూపే స్థాయిలో జరిగింది. అంతేగాక ప్రజలు వారి జీవనోపాధిని కోల్పోయే సమయంలో, మరింత పేదరికంలోకి వెళ్ళిపోకుండా ఈ పథకం నిరోధించగలిగింది.

5