పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆస్తులు మరియు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నది. జగనన్న కాలనీలు, వై.ఎస్.ఆర్. హౌసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా అందరికీ ఇళ్లు అందించడంపై మన ప్రభుత్వం దృష్టి సారించింది. నీతి ఆయోగ్ యొక్క 2021 బహుళ పేదరిక నివేదిక ప్రకారం, గృహ సౌకర్యాలు కలిగిన జనాభా శాతం పరంగా మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని గౌరవ సభకు తెలియచేసుకుంటున్నాను.

13. నాడు-నేడు కార్యక్రమాలను భారీ స్థాయిలో అమలు జరపడం ద్వారా అంగన్ వాడీలు, ఆసుపత్రులు మరియు పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనలో చారిత్రక నిర్లక్ష్యాన్ని మరియు తీవ్రమైన లోపాలను అధిగమించడానికి ఒక అవకాశం కల్పించబడింది. నీతి ఆయోగ్ యొక్క ఎస్.డి.జి.ల నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 100% కుటుంబాలకు విద్యుత్ అందించబడింది. అంతేగాక వీరంతా శుభ్రమైన వంట నూనెలను ఉపయోగిస్తున్నారు కూడా. మన రాష్ట్రంలో 91% కంటే ఎక్కువ పాఠశాలలలో గల భవన ప్రాంగణాలు, త్రాగునీరు మరియు విద్యుత్ తో కూడిన ప్రాథమిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయని కూడా ఈ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు కంటే ఇది 7% ఎక్కువ. ఆరోగ్యం విషయంలో, 99.5% కంటే ఎక్కువ కాన్పులు సంస్థాగతమైనవే, అనగా ప్రాథమిక లేదా జిల్లా వైద్య కేంద్రాలలో జరపబడినవే. అంతేగాక మన రాష్ట్రం వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సహాయ సిబ్బందితో కూడి 2వ అతిపెద్ద వైద్య సిబ్బందిని కలిగి ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇది మన ఆరోగ్య మౌలిక సదుపాయాల పటిష్టతను చూపుతుంది.

జీవనోపాధి

14. మూడవ మూల స్తంభం అయిన 'జీవనోపాధి కల్పన' అనేది 'సముచితమైన పని” మరియు “ఆర్థిక వృద్ధికి అవకాశం కల్పించడం' వంటి ఎస్. డి.జి.లను కలిగి ఉంటుంది.

15. జీవనోపాధిలో వ్యవసాయం మరియు పాడిపరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను మన ప్రభుత్వం గుర్తిస్తూ, వెనుకబడిన మరియు పురోగామి అనుసంధానాలను ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాలను ఆమోదించి అమలుపరుస్తోంది. వై.ఎస్.ఆర్. రైతు భరోసా, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. జల కళ, ధరల స్థిరీకరణ నిధి, గోదాములు, వై.ఎస్.ఆర్. అగ్రి-టెస్టింగ్ ల్యాబ్‌లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు అధిక మొత్తంలో పాల శీతలీకరణ కేంద్రాలు మరియు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ వంటి వివిధ పథకాల ద్వారా 62% జనాభాకు జీవనోపాధిని అందించే వ్యవసాయ రంగాన్ని మన ప్రభుత్వం సమగ్ర దృష్టితో అమలు చేస్తోంది. 'అమూల్ తో భాగస్వామ్యం' పాడి పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చి అనుబంధ గ్రామీణ ఆదాయాలకు ఒక ముఖ్యమైన వనరుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది.

4