పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదోని, చాగలమర్రి, నరసరావుపేటలో అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా నాలుగు నూతన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది.

111. మన రాష్ట్రం సమృద్ధిగా పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. పర్యాటక రంగం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కీలకమైన వృద్ధి సూచికలలో ఒకటి. అలాగే అది ఉపాధి కల్పనకు ముఖ్యమైన వనరు. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు ప్రక్రియ దశలో ఉన్నాయి.

112. హస్తకళలను అభివృద్ధి చేయడానికి మరియు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం కళాకారుల సంఘానికి ప్రత్యక్ష మార్కెటింగ్ వేదికను అందించడానికి మన ప్రభుత్వం శిల్పారామం కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పులివెందులలో ఉన్న శిల్పారామం పార్కును మరింత శక్తివంతమైన, ఆకర్షణీయమైన, పర్యాటక మరియు సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు, మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. గుంటూరులో నూతనంగా నిర్మిస్తున్న శిల్పారామం పార్కు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఇదే తరహాలో, ఆదాయాన్ని పెంపొందించడానికి మరియు చేతివృత్తుల వారి స్వయం-సమృద్ధి కోసం తిరుపతి, విశాఖపట్నం మరియు కడపలలో ఇప్పటికే ఉన్న శిల్పారామం పార్కుల సమగ్ర అభివృద్ధిని మా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది.

113. 2022-23 లో యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కోసం 290.31 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిపాలన

114. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజా సేవలను అందించడంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి, ఈ దిశగా అనేక చర్యలు చేపడుతోంది. ఒక కోటి మరియు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన వస్తువులు, సేవలు మరియు పనుల సేకరణకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానం తప్పనిసరి చేయడం జరిగింది. ఈ చర్య వలన రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 4,000 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగింది. ఈ విధంగా ఆదా చేసిన మొత్తాన్ని పౌర-కేంద్రీకృత మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించడం జరిగింది.

115. సుపరిపాలన ఎలా నిర్వహించాలో మరియు సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా సంక్షేమాన్ని ఎలా సాధించవచ్చో నిరూపించడంలో మన రాష్ట్రం ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రత్యక్ష నగదు బదలీ పద్ధతి ద్వారా పథకాలను అమలు చేయడం వలన ప్రజలు తమ ప్రయోజనాలను పారదర్శకంగా సకాలంలో పొందగలుగు తున్నారు.

30