పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా మన ప్రభుత్వం సుపరిపాలన దిశగా మరో అడుగు వేస్తోంది. ఈ చర్య ఫలితంగా వికేంద్రీకరణ మరియు సమర్థవంతమైన పరిపాలనను అందించే దిశగా కేంద్రీకృతమైన, సమ్మిళిత మరియు సుస్థిరమైన వృద్ధివైపు మన రాష్ట్రం దారి తీస్తుంది.

117. కోవిడ్-19 వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ, మన ప్రభుత్వం 23% ఫిట్ మెంట్ తో ప్రభుత్వ ఉ ద్యోగులు మరియు పెన్షనర్లకు 11వ వేతన సవరణను అమలు చేసింది. 5 కరువు భత్యాల వాయిదాలను ఒకేసారి విడుదల చేయడం, పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచండం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కూడా అమలు చేయడం జరిగింది.

118. స్థానిక అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో సంక్షేమాన్ని పెంచడానికి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి మన ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి నిధి(ఎస్.డి.పి.ఎఫ్.) ని ఏర్పాటు చేస్తోంది. ఈ నిధి ద్వారా పౌరులు మరియు ఎన్నికైన ప్రతినిధులు గుర్తించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ, రాష్ట్రమంతటా అభివృద్ధిని సమానంగా విస్తరించేలా కార్యాచరణ చేపడుతుంది. ఇకపై రాష్ట్ర శాసనసభలోని ప్రతి సభ్యుడు మరియు సభ్యురాలి వద్ద 2 కోట్ల రూపాయల నిధి ఉంటుంది. 2022-23 లో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి నిధి (ఎస్.డి.పి.ఎఫ్.) కి 350 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ఆర్థిక వృద్ధి సమీక్ష

2020-21 లెక్కలు

119. 2020 ఏప్రిల్ 01, నుండి 2021 మార్చి 31 వరకు గల ఆర్థిక సంవత్సరానికి గాను, ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి అంతిమ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు 35,540 కోట్ల రూపాయలు గాను, ద్రవ్యలోటు 55,167 కోట్ల రూపాయలు గాను ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (G.S.D.P.) పై, రెవిన్యూ లోటు 3.6% గాను, ద్రవ్యలోటు 5.59% గాను ఉంది.

సవరించిన అంచనాలు 2021-22

120. సవరించిన అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 1,73,818 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 18,529 కోట్ల రూపాయలు. 2021-22 సం||లో రెవెన్యూ లోటు సుమారు 19,545 కోట్ల రూపాయలు కాగా, ఇదే కాలానికి ద్రవ్య లోటు 38,224 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 1.63% మరియు 3.18% గా ఉన్నాయి.

31