పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతా సంస్కృతిని పెంపొందించడం మరియు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం కోసం మన ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫేక్చరింగ్ పాలసీ 2021-2024' మరియు 'ఆంధ్రప్రదేశ్ ఐ.టి. పాలసీ 2021-2024' లను తీసుకువచ్చింది. E.M.C. 2.0 పథకం కింద భారత ప్రభుత్వంచే ప్రప్రథమంగా ఆమోదించబడిన వై.ఎస్.ఆర్. E.M.C. పథకం అనగా ఎలక్ట్రానిక్ మాన్యుఫేక్చరింగ్ క్లస్టర్ పథకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 23, 2021న, కొప్పర్తిలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం క్రింద 500 ఎకరాల విస్తీర్ణంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో, 25,000 వేల మంది కంటే ఎక్కువ మంది ఉపాధి అవకాశాలను అందించేందుకు 8,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పలు కంపెనీలు దాదాపు 660 కోట్ల రూపాయల సంచిత పెట్టుబడులతో సుమారు 9,000 పై చిలుకు మందికి ఉ పాధిని కల్పించేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తూ ముందుకు రావడం జరిగింది.

99. రానున్న 2 నుండి 5 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడులతో 20,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐ.టీ. రంగం క్రింద 10 పెట్టుబడి ప్రతిపాదనలు అధునాతన దశలో ఉన్నాయి. వీటికి అదనంగా, వచ్చే 3 సంవత్సరాలలో 4,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడితో 25,000 ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫేక్చరింగ్ (ESDM) సెక్టార్ క్రింద మరో 15 పెట్టుబడి ప్రతిపాదనలు ప్రారంభ దశలో ఉన్నాయి.

100. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గతంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేయడానికి మన రాష్ట్రం రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది ఆర్థిక చెల్లింపుల ముగింపు దశలో ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంచే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందించబడిన మొదటి విమానాశ్రయంగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు వద్ద గల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నిలిచింది. కర్నూలు నుండి చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు రాష్ట్రం విమాన సర్వీసులు నడపటం ప్రారంభించింది. కర్నూలు నుండి తిరుపతి, విజయవాడకు కొత్త మార్గాలను ప్రతిపాదించడం జరిగింది. చెన్నై-కడప-విజయవాడ మధ్య షెడ్యూల్డ్ విమాన సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉ న్నాయి. ఇంకా, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, ఏరో స్పోర్ట్, నిర్వహణ మరియు మరమ్మత్తు సౌకర్యాలతో సహా 541 ఎకరాలలో ప్రతిపాదిత ఎయిర్ పోర్ట్ సిటీ కర్నూలు విమానాశ్రయంలో అభివృద్ధి దశలో ఉంది.

101. 2022-23లో పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2,755.17 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

27