పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93. 2022-23 లో నీటి వనరుల అభివృద్ధికి 11,482.37 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు

94. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు, ప్రజల జీవనోపాధికి మరియు మన 3వ మూల స్థంభానికి పునాదిగా నిలుస్తాయి. 8వ మరియు 9వ ఎస్.డి.జి.లు అయిన 'మర్యాద పూర్వకమైన పని' మరియు 'పరిశ్రమ, ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాల' యొక్క అమలుకు ఇవి మూల కేంద్రాలుగా నిలుస్తాయి. మన రాష్ట్రం ఆహారం మరియు వ్యవసాయ ప్రాసెసింగ్, వస్త్ర మరియు స్పిన్నింగ్, సముద్ర ఉత్పత్తులు, ఖనిజ ఉత్పత్తులు, ఇనుము మరియు ఉక్కు సిమెంట్, గ్రానైట్, ఫెర్రో మిశ్రమాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్స్, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్, బయోటెక్, మరియు సూక్ష్మ వాణిజ్య రంగాలలో పెట్టుబడులకు భారీ అవకాశాలను కలిగి ఉంది. చిత్తూరు- నెల్లూరు ప్రాంతం దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ భారతదేశంలోని టాప్-10 తయారీ గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది.

95. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫ్రేమ్ వర్క్ క్రింద, అన్ని ఆమోదాలు 21 రోజుల్లో అందించబడతాయి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల పనితీరును 2019-20లో 7వ ర్యాంక్ నుండి 2020-21లో ర్యాంక్ 4కి మెరుగుపరుచుకుంది, 2020-21లో ఎగుమతులు 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి, ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 13.8% వృద్ధి. జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం 5.8% సహకరిస్తుంది మరియు 2030 నాటికి ఎగుమతులను రెట్టింపు చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

96. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2021 నాటికి మొత్తం 7,107 సూక్ష్మ, చిన్న మరియు రహా పరిశ్రమలు 2,099 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడ్డాయి. 46,811 మందికి ఉపాధి కల్పిస్తూ, జనవరి 31, 2022 వరకు 2,048 కోట్ల రూపాయల పెట్టుబడితో 11 మెగా ప్రాజెక్ట్ కు స్థాపించబడ్డాయి. ద్వారా 3,989 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదనంగా, 93,116 మందికి ఉపాధి కల్పిస్తూ, 55 భారీ మరియు మెగా ప్రాజెక్టులు 44,097 కోట్ల రూపాయల పెట్టుబడితో వివిధ దశలలో ఉన్నాయి.

97. వై.ఎస్.ఆర్. నవోదయం ద్వారా, 7,976 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 1,78,919 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఖాతాలు MSME రుణాల స్కీమ్ యొక్క వన్ టైమ్ రీస్టక్చరింగ్ కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి పునర్నిర్మించ బడ్డాయి. 2021-22 లో మన ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు మరియు సాధారణ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు మరియు వస్త్ర పరిశ్రమలను అందుబాటులోనికి తేవడానికి 671 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేసింది.