పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70. పాఠశాల విద్యను మధ్యలోనే వదిలిపెట్టివేసే విద్యార్ధుల శాతానికి, విద్యార్ధులు ముఖ్యంగా బాలికల పాఠశాలలలో సరైన పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడానికి మధ్య సంబంధం ఉన్నదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం 15,000 రూపాయల అమ్మఒడి ఆర్థిక సహాయం నుండి 1,000 రూపాయిలను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మరుగు దొడ్ల నిర్వహణ నిధికి కేటాయించడం జరిగింది. ఈ నగదు మొత్తం పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ నిధికి బదిలీ చేయబడి, పాఠశాల అభివృద్ధి కమిటీల పర్యవేక్షణలో పాఠశాలలలో టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది.

71. విజ్ఞాన సామర్థ్యాల అభివృద్ధిలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తూ, మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం 45,484 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలలో చదువుతున్న సుమారు 37 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారమైన, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వేడి వేడి భోజనం అందిస్తోంది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా, స్వచ్ఛంద సేవకుల ద్వారా విద్యార్థుల ఇంటి వద్దకే పొడి రేషన్ పంపిణీ చేయబడింది.

72. జగనన్న విద్యా కానుక పథకం క్రింద 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాలలలో మొట్టమొదటి రోజునే విద్యార్జన కిట్ లను అందజేస్తుంది. ఈ కిలో 3 జతల ఏకరీతి వస్త్రాలు, కుట్టు ఛార్జీలు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ సెట్, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్, 1 స్కూల్ బ్యాగ్, 1 బెల్ట్ మరియు 3 మాస్క్‌లు ఉన్నాయి.

73. విద్యారంగంలో మన ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల ప్రభావం నాణ్యమైన విద్య యొక్క 4వ ఎస్.డి.జి.లలో సాధించిన అద్భుతమైన పురోగతిలో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక విద్యలో (1-8వ తరగతి) 2019-20లో 80.48% గా ఉన్న సర్దుబాటు చేయబడిన నికర నమోదు నిష్పత్తి 2021-22 లో 91.72% కి పెరిగింది. సెకండరీ స్థాయిలో (9-10వ తరగతి) 2019-20 నాటికి సగటు వార్షిక డ్రాపౌట్ రేటు 15.71% ఉండగా, 2021-22 లో 2.84% కి గణనీయంగా తగ్గింది. హయ్యర్ సెకండరీ విద్య (11-12వ తరగతి) లో 2014-15 లో 69% స్థూల నమోదు నిష్పత్తి (GER) ఉండగా ఇది 2021-22 లో 75.46% కి పెరిగింది. ఇంతేగాకుండా 94.56% పాఠశాలలలో విద్యుత్, త్రాగు నీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. సెకండరీ స్థాయి ఉపాధ్యాయులందరికీ 100% శిక్షణ ఇవ్వడం జరిగింది.

74. పాఠశాల విద్య కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 27,706.66 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సర కేటాయింపుల కన్నా 12.52% ఎక్కువగా ఉంది.

20