పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యారంగం

 
పరులకు సోదరులకు భూ
వరులకు గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చిన గోటి గుణా
త్తర వృద్ధి భజించు విద్య తన ధన మెపుడున్.

పంచిన కొద్దీ అనేక రెట్లు పెరిగేది ఒక్క విద్యాధనం మాత్రమే. చిన్నారుల చదువు కోసం పెట్టే ప్రతి రూపాయి రాష్ట్రాభివృద్ధికి తొలిమెట్టు అని మన ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

67. మానవ సామర్థ్య వికాసానికి మొదటి మూలస్తంభం విద్య. నీతి ఆయోగ్ యొక్క 2021 బహు ముఖ పేదరిక సూచిక నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని జనాభాలో 2% కంటే తక్కువ మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు.

జగనన్న అమ్మ ఒడి

అమ్మంటే అంతులేని సొమ్మురా...
అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా...
అమ్మ మనసున్న అమృతమే చూడరా...
అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా...

68. ఏ తల్లికీ బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డుకాకూడదనే ఆలోచనతో మా ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మన ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున నేరుగా 44,48,865 మంది తల్లుల ఖాతాలలోకి చేర్చడం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తోంది. 2022-23 లో జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను.

69. నాలుగు గోడలతో కూడిన భవనం రేపటి దేశ భవిష్యత్తును తనలో నింపుకుంటే దానిని పాఠశాల అని అంటారు. నాడు-నేడు కార్యక్రమం క్రింద, మొదటి దశలో 15,715 పాఠశాలలలో 10 మౌలిక సదుపాయాల ఆధునీకరణ పూర్తయింది. ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఫ్యాన్లు మరియు లైట్లు, త్రాగునీరు, పెయింటింగ్, అవసరమైన మరమ్మతులు, మంచి మరుగు దొడ్లు, ప్రహరీ గోడ, వంటగది మరియు ఇంగ్లీష్ ల్యాబ్ తో 10 రకాల మౌలిక సదుపాయాలను మా ప్రభుత్వం అందజేస్తోంది. రెండవ దశలో భాగంగా 16,368 పాఠశాలల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. మూడవ దశలో 24,620 పాఠశాలల ఆధునీకరణ చేపట్టనున్నాము. 2022-23 లో మన బడి, నాడు-నేడు కార్యక్రమాల కోసం 3,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

19