పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పథకం క్రింద 3,92,674 మంది లబ్ధిదారులకు 589 కోట్ల రూపాయల విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 590 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. లా నేస్తం

63. వై.ఎస్.ఆర్. లా నేస్తం క్రింద అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నాము. ఇప్పటి వరకు 23.7 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమం క్రింద పంపిణీ చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 15 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. కాపు నేస్తం

64. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా, మన ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు వై.ఎస్.ఆర్. కాపు నేస్తం క్రింద కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45- 60 సంవత్సరాల వయస్సు గల అర్హులైన మహిళలకు ఐదేళ్ల కాలవ్యవధిలో సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 3,27,349 మంది లబ్ధిదారులకు గత రెండేళ్లలో రూ.982 కోట్ల ఆర్థిక సహాయాన్ని మన ప్రభుత్వం అందించింది. రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. కాపు నేస్తం కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం

65. అల్పసంఖ్యాక వర్గాల వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఉపాధి అవకాశాల కోసం రుణ సదుపాయాలను కల్పించడం ద్వారా వారి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం జరుగుతోంది. స్వయం ఉపాధి కల్పన మరియు సాంకేతిక శిక్షణల ద్వారా నైపుణ్యాన్ని పెంచడానికి వారికి న్యాయమైన వాటా ఉండేలా మన ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మన ప్రభుత్వం నెలకు ఇమామ్ లకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలు చొప్పున పెంచిన గౌరవ వేతనాన్ని అందజేస్తోంది.

66. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం 18,518 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళికకు 6,145 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు 29,143 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 3,661 కోట్ల రూపాయల కేటాయింపులను నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా 2022-23 లో కాపు సంక్షేమానికి 3,537 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.

18