పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వం అందిస్తోంది. ఈ కార్యక్రమం క్రింద 7.8 లక్షల మంది లబ్ది పొందారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 260 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం

59. చేనేత పరికరాలను ఆధునీకరించడానికి మరియు మర మగ్గాల రంగానికి పోటీగా స్వంత చేనేత మగ్గాలున్న ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం పథకం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు అందజేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం క్రింద 81,703 మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు మరియు కాపు వర్గాలకు చెందిన నేత కార్మికులు లబ్ధి పొందారు. గత 3 సంవత్సరాలుగా మా ప్రభుత్వం అందించిన సహాయం ఫలితంగా, చేనేత కుటుంబాలవారు మర మగ్గాలు మరియు వస్త్ర పరిశ్రమకు పోటీగా కొత్త పద్ధతులలో నూతన నమూనాలతో నేయడానికి తమ మగ్గాలను ఆధునీకరించారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న తోడు

60. తోపుడు బండ్ల వారి ఆర్థిక కష్టాలను తీర్చడానికి మన ప్రభుత్వం, కేంద్రం పి.ఎం. స్వనిధి క్రింద ఇచ్చే సహకారంతో కలిపి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం జగనన్న తోడు పథకం క్రింద అందిస్తోంది. 2021-22 లో 86, 627 మంది షెడ్యూల్డ్ కులాల వారు మరియు 19,965 మంది షెడ్యూల్డ్ తెగల వారు ఈ పథకం క్రింద లబ్ధి పొందారు. ఈ కార్యక్రమం క్రింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో 14.16 లక్షల మంది ఆర్థిక సహాయం పొందారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 25 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న చేదోడు

61. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు మరియు కుట్టుపనివారికి సంవత్సరానికి 10,000 రూపాయలను జగనన్న చేదోడు పథకం ద్వారా మన ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇంతవరకూ 2,98,428 మంది లబ్ధిదారులకు 583.78 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 300 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం

62. అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు కోసం 'ఇ.బి.సి. నేస్తం' క్రింద, 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సంవత్సరానికి రూ.15,000 చొప్పున సహాయం అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది.

17