పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఈ నాలుగు మూల స్తంభాలు తూర్పు ఆసియాలోని అధిక పనితీరు గల ఆర్ధిక వ్యవస్థలతో సహా నేడు అన్ని అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి మార్గాలకు ఆధారం. అంటే, 2016 నాటి ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే (ఎస్.డి.జి.లే) కాక ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ల వంటి సంస్థల యొక్క ఇతర నివేదికలు కూడా ఈ మూలస్తంభాలపైనే ఆధారపడి ఉంటాయి.

4. రాష్ట్ర అభివృద్ధి పునాదులను నిర్మించడానికి మన ప్రభుత్వం ఈ నాలుగు మూల స్తంభాల విధానాన్ని స్వీకరించింది. మనరాష్ట్ర ప్రజలందరికీ వారి జీవితాలను మరియు జీవనోపాధిని నిర్మించుకోవడానికి సమాన అవకాశాలను అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి మన ప్రభుత్వం యొక్క అన్ని విధానాలు ఈ నమూనాను దృష్టిలో ఉంచుకునే తయారు చేయబడ్డాయి అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు నవరత్నాల ఏకీకరణ

5. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 ఎస్.డి.జి.లను దృష్టిలో ఉంచుకుని మన ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు మరియు మ్యానిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించబడ్డాయని తెలియజేసుకుంటున్నాను. ఇందుమూలంగా, మన రాష్ట్రం వివిధ అభివృద్ధి సూచికలలో స్థిరమైన పెరుగుదలను చూడగలిగింది. నీతి ఆయోగ్, ఎస్.డి.జి. ఇండియా 2020-21 నివేదిక ప్రకారం, 'పేదరిక నిర్మూలన', 'స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యాన్ని పెంపొందించడం', 'లింగ సమానత్వం', 'చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం' మరియు 'సముద్ర, జలజీవుల పరిరక్షణ' వంటి ఎస్.డి.జి.లలో మన రాష్ట్రం మొదటి 5 స్థానాలలో ఉంది.

6. ఎస్.డి.జి.లు విస్తృతమైన నమూనాను కలిగి ఉన్నాయని మన ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక అట్టడుగు వర్గాల భాగస్వామ్యం మరియు సమాజ వికాసం లేకుండా ఈ ఎస్.డి.జి.లను సాధించవచ్చని అనుకోవడం అసాధ్యం కూడా. గ్రామ మరియు వార్డు సచివాలయాలు, వాలంటీర్ నెట్ వర్క్ మరియు రైతు భరోసా కేంద్రాల వంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం, విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల భారీ ఆధునీకరణ మరియు మహిళా స్వయం సహాయక సంఘాలను ఇంతకు ముందుకన్న అధికంగా బలోపేతం చేయడం ఈ పనితీరుకు గల కారణాలని తెలియజేస్తున్నాను. వికేంద్రీకృత పాలనపై సమగ్ర దృష్టిని సారిండం ద్వారా, క్లిష్టమైన ఎస్. డి.జి.ల సూచికలలో కూడా మన ప్రభుత్వం అద్భుతమైన పనితీరు సాధించగలిగింది.

7. నీతి ఆయోగ్ తన 'ఎస్. డి.జి. నివేదిక' లో ఎస్.డి.జి.లను అవుట్ కమ్ బడ్జెట్ స్టేట్ మెంట్ నమూనా (OBS) తో అనుసంధానం చేయాలని సిఫార్సు చేసింది. నిర్దిష్ట సమయంలో ఈ ప్రమాణాలను సిద్ధం చేసుకోవడం, పర్యవేక్షించడం మరియు మదింపు చేయడం కోసం ఎస్.డి.జి.లను అవుట్ కమ్ బడ్జెట్ స్టేట్ మెంట్ తో విజయవంతంగా ఏకీకృతం చేయడంలో మనదేశంలోని అన్ని రాష్ట్రాలలోను మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2