పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్,

గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం

మార్చి 11, 2022

గౌరవనీయ అధ్యక్షా!

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదించబోతున్నాను.

1. ప్రప్రథమంగా నేను ప్రఖ్యాత కవి తిరువళ్ళువార్ సూక్తులను ఈ గౌరవ సభకు గుర్తు చేయదలచు చున్నాను.

“గొప్ప పాలకులు అనబడేవారు
అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా
ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు.
వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
ధర్మ పథం మరియు న్యాయ మార్గాల నుండి వైదొలగరు.
ఆత్మ గౌరవంతో, దయతో కూడిన ధైర్యంతో
ముందుకు సాగుతారు."

2. ఈ వాక్యాలు శతాబ్దాల అనంతరం ఒక్కసారిగా వచ్చిన విపత్తును ఎదుర్కొనే విషయంలో మన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కోవిడ్ మహమ్మారి అనంతర పరిణామాల నుండి బయటపడే క్రమంలో మన ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి మరియు శ్రేయస్సు మార్గంలో నడిపించడం ద్వారా మరింత విజ్ఞతను ప్రదర్శిస్తోంది.

అభివృద్ధి విధాన రూపకల్పనలలో మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, జీవనోపాధికి మద్దతు మరియు సామాజిక భద్రత అనే ఈ నాలుగు మూల స్తంభాలపై ఆర్థికశాస్త్ర ప్రామాణిక నమూనాలు దృష్టి సారిస్తాయి. ఈ నాలుగే అమలుపరచగలిగే విధానాలు. ఇవి సుపరిపాలనతో కలిపి, స్థిరమైన ఆర్థిక వృద్ధికి ఆధారం కల్పిస్తున్నాయి. ఇందులోని అంతర్లీన సూత్రం ఏమిటంటే, పౌరులు తమ అంతర్గత సామర్థ్యాన్ని గ్రహించే అవకాశాలను ఈ నాలుగు మూల స్తంభాలు కల్పిస్తున్నాయి.

1