పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.ఎస్.ఆర్. ఆసరా

51. వై.ఎస్.ఆర్. ఆసరా పథకం క్రింద, 11.04.2019 నాటికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా నాలుగు విడతలలో తిరిగి చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు 12,757.97 కోట్ల రూపాయలను విడుదల చేయడంవలన స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,74,438 అర్హతగల సభ్యులు లబ్ది పొందారు. వై.ఎస్.ఆర్. ఆసరా పథకానికి 2022-23 సంవత్సరంలో 6,400 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ

52. స్వయం సహాయక సంఘాల మీద రుణాల వడ్డీ భారాన్ని పేదలకు తగ్గించేందుకు మన ప్రభుత్వం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ చర్య గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని పేద స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసింది. 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను 7,36,472 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 1,789 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. 2022-23 సంవత్సరానికి వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకానికి 800 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. చేయూత

53. నవరత్నాల అమలులో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు అందించే 75,000 రూపాయల ఆర్థిక సహాయం కొనసాగించబడుతోంది. ఈ పథకాల క్రింద సుమారు 24.95 లక్షల మంది లబ్ధిదారులు వివిధ జీవనోపాధి కార్యకలాపాలను ఎంచుకోవడం జరిగింది. స్థిరమైన జీవనోపాధిని అందించడానికి హెచ్.సి.ఎల్., ఐ.టి.సి., పి అండ్ జి మరియు రిలయన్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా వివిధ దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2022-23 లో, వై.ఎస్.ఆర్. చేయూత కోసం 4, 235.95 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.

54. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4,322.86 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. మన ప్రభుత్వం 2021-22 లో మొదటి సారి పిల్లలు మరియు జెండర్ బడ్జెట్ లను ప్రవేశపెట్టింది. 2022-23 కి సంబంధించిన చిల్డ్రన్ మరియు జెండర్ బడ్జెట్ యొక్క బుక్ లెట్లను గౌరవనీయుల సభ్యుల పరిశీలన కోసం ప్రవేశపెడుతున్నాను.

15