పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నది. ఇది 2021-22 నాటికి 87% కి పెరిగింది. మాతా-శిశు మరణాల రేటు 2019-20 లో ఉన్న 74 నుండి 2021-22 లో ప్రతి లక్ష జననాలకు 59 కి తగ్గింది. 5 ఏళ్లలోపు మరణాల రేటు 2019-20 లో ఉన్న 41 నుండి 2021-22 లో ప్రతి 1000 సజీవ జననాలకు 14 కి తగ్గింది. నివేదించబడిన మొత్తం కాన్పులలో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాలలో జరిగిన కాన్పుల శాతం 2019-20 లో 67% ఉండగా, 2021-22 నాటికి 99.87%కి పెరిగింది.

47. 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల శారీరక, మానసిక విద్యాభివృద్ధికి పునాది వేయాలనే ఉద్దేశ్యంతో, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సవరించబడిన నర్సరీ విద్యా కరిక్యులమ్ తో మన ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలలను ప్రవేశపెట్టింది. ఆంగ్ల భాషపై దృష్టి సారించి అన్ని అంగన్ వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2 తరగతులను ప్రవేశపెట్టారు. అంగన్ వాడీ కార్యకర్తలందరికీ కొత్త ప్రీ-స్కూల్ కరిక్యులమ్ లపై శిక్షణ అందించారు. మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలలో 27,620 అంగన్‌వాడీ కేంద్రాలు ఫౌండేషన్ పాఠశాలలుగానూ, 27,987 అంగన్‌వాడీ కేంద్రాలు ఉపగ్రహ ఆధారిత పాఠశాలలుగానూ పనిచేస్తున్నాయి.

48. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల బాధ్యతను కూడా మన ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కో చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ పథకం క్రింద ఇప్పటివరకు 298 మంది పిల్లలు లబ్ది పొందడం జరిగింది.

49. కౌమార దశలో ఉన్న బాలికల మరియు స్త్రీల ఆరోగ్యం మరియు రుతుక్రమ కాలంలో వారి పరిశుభ్రతా అవసరాల కోసం, మన ప్రభుత్వం 'వై.ఎస్.ఆర్. స్వచ్ఛ' కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని క్రింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది కౌమార దశలోని బాలికలు లబ్ది పొందుతున్నారు. వీరికి నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ న్యాప్ కిన్లను మన ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతోంది.

మహిళా సాధికారత

“మహిళల సాధికారత అనేది ఉత్తమ కుటుంబమును,
ఉత్తమ సమాజమును, చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుంది" - డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం

50. అభివృద్ధి ఎజెండాలో మహిళలను కేంద్ర స్థానంలో ఉంచడం వలన సంస్థలు మరియు వాటి వనరుల నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించిన 5వ ఎస్.డి.జి.అయిన 'లింగ సమానత్వం' సూచీలో మన రాష్ట్రం కేవలం రెండేళ్ల కాలంలో 12 ర్యాంకులు మెరుగుపరుచుకుని 5వ ఉత్తమ స్థానాన్ని పొందింది. ఈ రెండేళ్ళలోనే ఈ సూచి 37 నుండి 58 కి పెరిగింది.

14