పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38. వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకం క్రింద మా ప్రభుత్వం ఆపరేషన్ తరువాత రోగి కోలుకునే వ్యవధిలో రోజుకు 225 రూపాయల చొప్పున ఆపరేషన్ అనంతర జీవనోపాధి భత్యాన్ని రోగులకు అందిస్తుంది. డిసెంబర్ 2019 నుండి ఆరోగ్య ఆసరా కింద 8,83,961 కేసులకుగాను శస్త్రచికిత్స అనంతర జీవనోపాధి భత్యం కోసం 489.61 కోట్ల రూపాయలు అందించడం జరిగింది.

39. అదనంగా,కోవిడ్-19 బాధిత ప్రజలకు వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవను అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. పది విడ్-19 చికిత్సలు మరియు కోవిడ్-19 అనంతర చికిత్సా విధానాలు వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం క్రింద చేర్చబడ్డాయి. కేవలం 2,09,765 మంది రోగుల చికిత్సకై ప్రభుత్వం 732.16 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం కోసం 2,000 కోట్ల రూపాయలను మరియు వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకానికి 300 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

40. 104 మరియు 108 సేవలు కూడా మన రాష్ట్రంలో పునరుద్ధరించబడ్డాయని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మండలానికి 1 చొప్పున 104 సంచార వైద్య వాహనాల యూనిట్ల సంఖ్య 292 నుండి 656 కి పెంచడం జరిగింది. వీటి ద్వారా ECG మరియు మందులతో సహా 29 రకాల పరికరాలతో అన్ని సాంక్రమిత మరియు అసాంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో సహా 20 రకాల సేవలను మన ప్రభుత్వం అందిస్తోంది. అదేవిధంగా, 108 అంబులెన్స్లో సంఖ్య 768 కి పెరిగింది. జనాభా పరంగా సంచార వాహనాల సంఖ్య నిష్పత్తి 1:1, 19,595 నుండి 1:74,609 కి మెరుగుపడింది. పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణా లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం 120 పట్టణ స్థానిక సంస్థలలో 560 వై.ఎస్.ఆర్. పట్టణ క్లినిక్ లను మంజూరు చేసింది.

41. గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్.సి.వరం, బుట్టాయిగూడెం మరియు డోర్నాలలో 5 మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను మా ప్రభుత్వం మంజూరు చేసింది. పాడేరులో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులను రెండేళ్లలోపు పూర్తి చేయాలనేది మా ప్రభుత్వం సంకల్పం.

42. పౌరుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంపై మన ప్రభుత్వం దృష్టి సారించిన ఫలితంగా, 2019 కి ముందు 108.25 కోట్ల రూపాయలుగా ఉన్న సగటు నెలవారీ వ్యయం జూన్ 2019 తర్వాత 203.68 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది 3వ ఎస్.డి.జి. అయిన 'మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు' సాధించడంలో మన ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచింది.

12