పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకుండా అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించడానికి, వరి పంట ప్రధానంగా ఉన్న ప్రాంతాలలో పంట కోతలో యాంత్రీకరణ సేవలను ప్రోత్సహించడానికి, 1615 క్లస్టర్ స్థాయి CHC లను పంటకోత యంత్రాలు అనగా కంబైన్డ్ హార్వెస్టర్లు, వరిగడ్డి బైలర్లు మొదలగు వాటితో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఉచిత మరియు రాయితీతో విద్యుత్ సరఫరా

33. మన ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం 19.64 లక్షల పంపుసెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తోంది. ఉద్యానవన మరియు నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్ ను మన ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇంతేగాకుండా ఆక్వా రైతులకు, యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నాము. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చేందుకు అయ్యే ఖర్చును కూడా మన ప్రభుత్వమే భరిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలను విద్యుత్ రాయితీ కొరకు ప్రతిపాదిస్తున్నాను.

పశు సంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమాభివృద్ధి

34. కోళ్ళ పరిశ్రమ, పాడిపరిశ్రమ, పశువుల పెంపకం మరియు మత్స్య పరిశ్రమలు వ్యవసాయ సమాజానికి అనుబంధ ఆదాయం అందిస్తూ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాథమిక జీవనోపాధిగా మారాయి. 2020-21 లో దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ మన రాష్ట్రం నిలిచింది. వై.ఎస్.ఆర్ పశు నష్ట పరిహార పథకం క్రింద 43,988 మంది రైతులకు ఆవు లేదా గేదె ఒక్కింటికి 30,000 రూపాయల చొప్పున మరియు గొర్రె లేదా మేక ఒక్కింటికి 6,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించడం కోసం 169.52 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి. రైతుల యొక్క పశువుల వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి, 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. అంతేకాకుండా, దేశంలోనే తొలిసారిగా 340 అంబులెన్లను కొనుగోలు చేయడం ద్వారా సంచార పశు అంబులేటరీ క్లినిక్లను ప్రారంభించడం జరిగింది.

35. మొత్తం చేపల ఉత్పత్తిలో 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి 29.40% వాటాతో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటూ, 16.5 లక్షల జనాభాకు జీవనోపాధిని కల్పిస్తోంది. భారత దేశ మత్స్య ఎగుమతులలో 36% వాటాను కలిగి మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా పథకం క్రింద చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే 4000 రూపాయల నష్ట పరిహారాన్ని 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 97,619 మంది తీరప్రాంత మత్స్యకారులు లబ్ది పొందుతున్నారు. గ్రామ స్థాయిలో రైతులకు మూల వనరుల పరీక్ష సౌకర్యాలు కల్పించేందుకు

10