పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారీగా, నిర్ణయాత్మక ఓటు వేయడమెలా జరిగింది? ఆర్ధిక వ్యవస్థ రెండంకెల వృద్ధి రేటును సాధించడం నిజమయినట్లయితే, వృద్ధిని వక్రీకరించి ధనవంతులను మరింత ధనవంతులుగా మరియు పేదలను మరింత పేదలుగా చేసి, వృద్ధి వనరులు కొద్దిమంది చేతులలో కేంద్రీకృతం చేసి అధిక సంఖ్యాకుల దుఃఖానికి కారణమయిందని దీని అర్థం. ఉద్యోగాలలేమి; ఆదాయ లేమిలో వృద్ధి; విలాసాల కోసం ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా విలువైన వనరుల దుబారా వంటివి; పేదలు, అణగారిన ప్రజలలో తీవ్ర కోపానికి కారణమయింది. సమాజంలో పెరుగుతున్న అసమానతల ధోరణిని తక్షణమే అరికట్టవలసియున్నది. మా బడ్జెట్ ద్వారా ఆదాయాల లేమి వంటి వాటిని లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా సామాన్య స్త్రీ, పురుషుల కోసం కుటుంబ ఆదాయ ఆధారిత వృద్ధి మరియు అభివృద్ధిలో పెరుగుదల సాధించడం జరుగుతుంది.

9. బహుశా మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ వారసత్వంగా పొందని అత్యంత దయనీయ ఆర్థిక స్థితిని ఈ ప్రభుత్వం వారసత్వంగా పొందినది అని నేను మన గౌరవ సభ్యులకు మరియు మన ప్రజలకు తెలియజేస్తున్నాను. విభజన సమయంలో రూ.1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం (ప్రభుత్వ రుణం రూ.97,124 కోట్లు, ప్రజా పద్దు రూ.33,530 కోట్లు) 2018-19 నాటికి రూ.2,58,928 కోట్లకు (ప్రభుత్వ రుణం రూ.1,92,820 కోట్లు, ప్రజా పద్దు రూ.66,108 కోట్లు) విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా, వివిధ సంస్థల ద్వారా దాదాపు రూ.10,000 కోట్లు రుణం తీసుకొని ప్రభుత్వ ఖర్చు కోసం మళ్లించింది. దీనికి అదనంగా, సుమారు రూ.18,000 కోట్ల విలువైన బిల్లులు పెండింగులో ఉన్నాయి.

10. ఈ రుణాలన్నింటితో పాటు, ఫిబ్రవరిలో సమర్పించిన 2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ క్రింద వాగ్దానాలను నెరవేర్చడానికి దాదాపు రూ.45,000 కోట్ల పనరుల అంతరాయం ఉన్నదని మాకు తెలిసింది. ఈ వనరుల అంతరం, ఈ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నూతన కార్యక్రమాల అమలు కోసం బడ్జెట్ అవసరాలను మరింత పెంచింది. ఇది ఈ ప్రభుత్వానికి సంక్రమించిన భిన్నమైన ఆర్ధిక పరిస్థితి.

5