పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“యాభై సంవత్సరాల గణతంత్ర కాలంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ-న్యాయం మనతోటి లక్షలాది ప్రజలకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు ఇంకా వారికి అందాల్సివుంది. ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యంగల వ్యక్తులు ఎక్కువగా ఉన్న దేశాలలో మన దేశం ఒకటి. అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక నిరక్షరాస్యులు మన దేశంలోనే ఉన్నారు. అంతేకాకుండా, మధ్యతరగతి వారు మరియు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు కూడా ఎక్కువే. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. మన భారీ కర్మాగారాలు మురికివాడల నుండే ఉద్భవిస్తాయి. పేదవారి పూరి గుడిసెల మధ్య నుండే ఉపగ్రహాలు నింగికెగుతాయి.”

106. అధ్యక్షా, మన ముఖ్యమంత్రిగారు “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే మాటల ద్వారా తొలి కొన్ని వారాలలోనే మన రాష్ట్రం మార్గదర్శినిగా ఎదిగేందుకు బీజం వేశారు. మొదటి సంవత్సరంలోనే మేనిఫెస్టోను అమలుపర్చడానికి మన ముఖ్యమంత్రిగారు ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈ లక్ష్య సాధనలో మన చేతులను కట్టివేస్తున్న పరిమిత వనరుల పరిధి లోపలే సంక్షేమం మరియు సంపద కల్పన మధ్య సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తున్నాము.

107. ఈ సందర్భంగా శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ పలికిన మాటలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి.

“ఏదైనా పొందేందుకు మనం సామర్థ్యాన్ని కల్పించినట్లయితే మనకు చెందిన ప్రతీది మన వద్దకు వస్తుంది.”

- రవీంద్రనాథ్ ఠాగూర్

108. ఉత్సాహవంతులైన, కష్టపడి పనిచేసే స్వభావంగల ప్రజలున్న మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే సామర్థ్యాన్ని కలిగివుంది. మనకు సంక్రమించిన ఆర్థిక అవరోధాలతో నిమిత్తం లేకుండా మన రాష్ట్రం తన నిజమైన సామర్థ్యం మేరకు ఎదిగేందుకు ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

37