పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51. ఈ ప్రభుత్వం ప్రత్యేకించి మాతా, శిశు ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) 74. 2019-20 చివరి నాటికి దీనిని 55 కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అదేవిధంగా, శిశు మరణాల రేటును 32 నుండి 22 కు తగ్గించాలని ఉద్దేశిస్తున్నాము. ఈ సంవత్సరం చివరి నాటికి మాటికి నూరు శాతం ప్రసవాలు సంస్థాగతపరంగా జరిగేలా చూడాలని భావిస్తున్నాము.


వైఎస్ఆర్ గృహనిర్మాణ పథకం

పక్షికి గూడు ఉంటుంది.
మృగాలకు గుహలు ఉంటాయి.
చిన్న చీమ కూడా పుట్ట ఏర్పాటు చేసుకుంటుంది.
ఓ నీడంటూ లేని దురదృష్టకరమైన పరిస్థితి మనిషిదే.
అందులోనూ పేదలూ, నిరుపేదలూ జానెడు జాగా కోసం జీవితమంతా కష్టపడుతున్నారు.

52. వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తూ, రాబోయే 5 సంవత్సరాలలో, 25 లక్షల గృహాలను నిర్మించాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంవత్సరం, ఇంటి స్థలాలను పంపిణీ చేయడమవుతుంది. తగిన భూమిని గుర్తించేందుకు పనిని ప్రారంభించాము. అవసరమైతే, ప్రైవేటు భూములను తీసుకుంటాము. మునుపటి ప్రభుత్వం, గత 5 సంవత్సరాలుగా, పట్టణ ప్రాంతాలలో 91,119 గృహాలను మరియు గ్రామీణ ప్రాంతాలలో 7,04,916 గృహాలను మాత్రమే నిర్మించగలిగింది. గృహ నిర్మాణ కార్యక్రమం పట్ల మా నిబద్ధతను చూపేందుకు, 2020, మార్చి 25 తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఇల్లు లేని వారికి 25 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేసేలా చూడాలని గౌరవ ముఖ్యమంత్రిగారు ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారు. హక్కుపత్రాన్ని కుటుంబంలోని మహిళ పేరుతో ఇవ్వడమవుతుంది. అంతేగాక, ఈ స్థలాలలో నిర్మించిన ఇళ్లను పేదలు తమ భవిష్యత్తు అవసరాల కోసం తనఖా పెట్టుకోవచ్చు. ఈ కార్యక్రమానికి రూ. 8,615 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

20