పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47. అత్యవసర పరిస్థితిలో తొలి కీలక గంటలు రోగి యొక్క విధిని నిర్ణయిస్తాయని మనకు తెలుసు. వారు అసుపత్రికి చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా కచ్చితంగా రోగులను కాపాడటానికి 108 కార్యక్రమాన్ని ప్రారంభించడమయింది. రాష్ట్రంలోని ప్రతి ప్రదేశానికి వర్తింపచేయడానికి ప్రతి మండలంలో ఒక 108 ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రిగారు ఆదేశించారు. అంబులెన్సు 20 నిమిషాల లోపల రోగిని చేరుకోగలగాలి. ఆ ప్రకారంగా, మొత్తం రూ. 143.38 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంతో 432 అదనపు అంబులెన్సులను సేకరించాలని మేము ప్రతిపాదిస్తున్నాం.

48. గ్రామ స్థాయిలో వైద్య అధికారుల ద్వారా నాణ్యమైన ప్రాధమిక ఆరోగ్య రక్షణ సేవలను అందించే ఉద్దేశంతో, 104 కార్యక్రమాన్ని ప్రారంభించడమయింది. ఈ కార్యక్రమ వర్తింపును సంతృప్త స్థాయికి తేవాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. తదనుసారంగా, మొత్తం రూ. 179.76 కోట్ల కార్యక్రమ సంబంధ వ్యయంతో 676 అదనపు వాహనాలను సేకరించి, సర్వీసు నాణ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

49. 2 సంవత్సరాల వ్యవధిలో ఉత్తమ కార్పొరేటు ఆసుపత్రులతో సమానంగా మన ప్రభుత్వ ఆసుత్రుల స్థితిని మార్పు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకొరకు, ఒక పరివర్తనా ప్రణాళికను రూపొందించాము. ఇందునిమిత్తం రూ.1,500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

50. ఈ ప్రభుత్వం గిరిజన జనాభా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరికి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రాధమిక ఆరోగ్య సర్వీసులుగా ఉంటాయి. అందువల్ల, ఈ సంవత్సరం రూ.66 కోట్ల ప్రాధమిక వ్యయంతో పాడేరు /అరకు ప్రాంతాలలో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అదనంగా, ఒక్కొక్క దానికి రూ.66 కోట్ల ప్రాధమిక బడ్జెటుతో పల్నాడుకు సేవ చేయడానికి గురజాల వద్ద మరియు ఉత్తరాంధ్రకు సేవలందించడానికి విజయనగరంలో రెండు వైద్య కళాశాలలను నెలకొల్పాలని, రూ.50 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం.