పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరోగ్యశ్రీ

4. ఈ సందర్భంగా, మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైఎస్. రాజశేఖర రెడ్డి గారి చిరస్మరణీయమైన సేవలను మననం చేసుకోవాలి. 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆయన అందించిన బహుమానాలు. ఆంధ్రప్రదేశ్‌లో వాటిని ప్రారంభించిన తరువాత అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను అనుసరించడం ప్రారంభించాయి. వారి యొక్క వాస్తవ లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ కార్యక్రమాలకు పునఃప్రాణం పోయవలసిన అవసరమున్నది.

45. ప్రతి పేద కుటుంబం ప్రభుత్వ మరియు కార్పొరేటు ఆసుపత్రులలో నాణ్యమైన చికిత్సను పొందగలిగే లక్ష్యంతో స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. ప్రజలు, పేదరికంలో పడిపోవడానికి ఆరోగ్య ఖర్చులు ప్రాధమిక కారణంగా ఉన్నాయని సూచించడానికి ప్రపంచవ్యాప్తంగా తగినంత సాక్ష్యం ఉన్నది. అందువలన, పేదరికంలో పడిపోకుండా అనేక కుటుంబాలను డా.వైఎస్ఆర్ గారు కాపాడారని తెలపడం సముచితంగా ఉంటుంది.

46. ఈ కార్యక్రమాలు వాటి యొక్క మునుపటి వెలుగును తిరిగి పొందుతాయని ఈ ప్రభుత్వం హామీ ఇస్తున్నది. తదనుసారంగా, ఆరోగ్యశ్రీ వర్తింపును ఈ క్రింది విధంగా విస్తరించాలని యోచిస్తున్నది. (i) వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు అంటే నెలకు రూ.40,000/ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు గణనీయంగా వర్తిస్తుంది. (ii) వైద్య ఖర్చులు రూ.1,000/లు మించిన అన్ని కేసులు. (iii) చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా అన్ని కేసులకు చికిత్సను అందించడం. సరిహద్దు జిల్లాలలో ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల బెంగుళూరు, హైదరాబాదు, చెన్నై వంటి తదితర నగరాలలోని మంచి ఆసుపత్రులను ప్రభుత్వ జాబితాలో చేరుస్తుంది. అన్ని రకాల రోగాలు, సర్జరీలను ఆరోగ్యశ్రీ క్రింద వర్తింపు చేయడమవుతుంది. ఇది మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపును కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి రూ. 1,740 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

18