పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. ప్రస్తుతం, దేశంలో విద్యాపరంగా, పౌష్టికాహార ఫలితాలపరంగా తోడ్పాటునందించే అత్యంత సమర్ధవంతమయిన అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తృతంగా గుర్తించడం జరిగింది. ఈ పథకం క్రింద అందించే ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కుక్-కం-హెల్పర్ గౌరవ వేతనాన్ని నెలకు రూ.1000/-ల నుండి రూ.3000/-లకు పెంచడమయింది. ఇందునిమిత్తం రూ. 1,077 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

42. విద్యార్థులు వారి ఉన్నత విద్యకు సంబంధించిన నిధుల సమీకరణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ ప్రభుత్వం గమనించింది. మెట్రిక్ అనంతర కోర్సులలో తల్లిదండ్రులు, విద్యార్థుల భారాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం 'జగనన్న విద్యా దీవెన పథకాన్ని' అమలు చేయడం ద్వారా అన్ని కమ్యూనిటీల వారికి చెందిన విద్యార్థులకు నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ను సమకూరుస్తుంది. కుటుంబాలపై అధిక భారం మోపే ఆహారం, ప్రయాణం, హాస్టలు, పుస్తకాలు మొదలైన ఇతర ఖర్చులను భరించేందుకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్ధికి రూ.20,000/-ల చొప్పున నిర్వహణ మద్ధతును కూడా ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇందునిమిత్తం రూ. 4,962.3 కోట్ల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 15.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చుతుంది.

43. అఖిల భారత సాంకేతిక విద్యామండలిచే సూచించబడిన ఉన్నతాధికార నిపుణుల సంఘం సిఫారసుల ప్రకారం, ఇంజనీరింగ్ పాఠ్యప్రణాళికను ప్రభుత్వం రీడిజైన్ చేసింది. ఫలితంగా ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో అందించే కోర్సులు పరిశ్రమల నైపుణ్య ప్రమాణాలకు తగ్గట్టుగా క్రమబద్ధం చేయబడ్డాయి. ఉద్యోగాలను పొందడానికి విద్యార్థులు సన్నద్ధమై ఉండటానికి ఇది దోహదపడుతుంది. ఉన్నతీకరించిన పాఠ్యప్రణాళికను 2019-20 విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, అనుబంధ గుర్తింపు కళాశాలల్లో అమలు చేయడమవుతుంది. అదేమాదిరిగా, ఈ ప్రభుత్వం, కోర్సులను ఉన్నతీకరించడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతిక కళాశాలలకు కూడా పూర్తి మద్ధతును అందిస్తుంది. ఈ ప్రభుత్వం పరిశ్రమ అవసరాలను తీర్చడానికి పాలిటెక్నిక్ విద్య ద్వారా కూడా నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది లభ్యతను పెంచుతుంది.

17