పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంది. అధ్యక్షా, వనరుల లేమి కారణంగా ఏ బిడ్డా పరిజ్ఞానం అనే దాహార్తిని తీర్చుకోవడంలో వెనుకబడిపోకూడదనే ఉద్దేశాన్ని దృష్టిలో వుంచుకొని ఈ దిశగా నిబద్ధతను కనబరచడానికి 'జగనన్న అమ్మఒడి' అనే పథకాన్ని ప్రకటించడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. పాఠశాలకు తన పిల్లలను పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం రూ.15,000/- లు అందిస్తుంది. మొదటిగా, ఈ పథకాన్ని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింప చేయాలని ఉద్దేశించడమయింది. ప్రస్తుతం, ఇంటర్మీడియట్ వరకు గల విద్యార్ధులను చేర్చుతూ ఈ పథకం వర్తింపును విస్తరించడమయింది. గత ప్రభుత్వం, ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు ఇంటర్మీడియేట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుండే ఈ ప్రభుత్వం 'జగనన్న అమ్మ ఒడి' క్రింద రూ.15,000/-లు అందిస్తున్నది. రూ. 6,455 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుస్తున్నది. ఈ పథకం రాష్ట్రంలో విద్యకు సంబంధించిన అన్ని ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

40. మౌలిక సదుపాయాలు మరియు నేర్పుతున్న విద్య నాణ్యతను గణనీయంగా పెంచుతూ, ప్రభుత్వ పాఠశాలల గతులను మెరుగుపరచేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాఠశాలలన్నీ వాటి మౌలిక సదుపాయాల ప్రమాణాలను మెరుగుపరచుకునేటట్లు చూడాలని గౌరవ ముఖ్యమంత్రిగారు మాకు ఆదేశించారు. ప్రస్తుత మరియు 2 సంవత్సరాల తరువాత పాఠశాల ఫోటోలను ప్రజలకు చూపడం ద్వారా మేము జవాబుదారీగా ఉంటాము. మంచి కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు వాటిని పూర్తిగా పునరుద్ధరించడమవుతుంది. ఆ ప్రకారంగా, ప్రభుత్వం పాఠశాల మౌలిక సదుపాయాల ఆధునీకీకరణ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నది. ఈ సంవత్సరం, రూ.1,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెడతుంది. మన పిల్లలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా కూడా ఉద్యోగాల కోసం వెళ్లవలసినప్పుడు వారికి నమ్మకం మరియు సమర్థతను కలిగించడమే ఈ చర్య ఉద్దేశ్యం. తెలుగు భాష ప్రాముఖ్యతను కాపాడాలనే ఉద్దేశంతో తెలుగును తప్పనిసరి చేస్తాం. ఈ ప్రభుత్వం ఫీజులను నియంత్రించి, క్రమబద్ధం చేయడానికి, విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రైవేటు విద్యా సంస్థలలోని టీచర్ల బాగోగులను సంరక్షించడానికి క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమీషన్ గౌరవ ముఖ్యమంత్రికి నేరుగా నివేదిస్తుంది.

16