పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుణాలు, ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర పూచీ, ఆత్మహత్య మరియు ప్రమాద మరణ సందర్భాలలో సహాయం వంటి వివిధ కార్యక్రమాల నుండి చేకూరే మద్ధతు, సబ్సిడీలు మరియు ప్రయోజనాలతో కౌలు రైతులు 11 నెలల కాలానికి పంట సంబంధ హక్కులను కలిగి ఉండేందుకు, వీలుకల్పించే చట్టబద్ద యంత్రాంగాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

34. పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి, రూ.100 కోట్ల బడ్జెటుతో ఈ సంవత్సరం నుండి పాడి, సహకార సంఘాలను పునరుద్ధరించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పునరుద్ధరణ తరువాత, వచ్చే ఏడాది నుండి, ఈ సహకార సంఘాలు రైతుల నుండి పాలను నేరుగా కొనుగోలు చేసి, వారికి లీటరుకు రూ.4/-ల బోనస్ ఇస్తారు. తద్వారా, పాడి రైతుల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. అంతేగాక, సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రతిపాదిస్తూ, ఇందుకోసం బడ్జెటులో రూ.100 కోట్ల కేటాయింపును చేస్తున్నాము.

35. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు తమ ఆదాయాలను కోల్పోతున్నారు. వారి నష్టాలను నివారించడానికి, ఈ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని రూ.4,000/-ల నుండి రూ.10,000/-లకు పెంచుతుంది. సంతృప్తతను నిర్ధారించేందుకు తగిన మదింపు చేసిన తరువాత ఈ మొత్తాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇందునిమిత్తం మరియు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం 1,17,053 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు రూ.200 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక, ఈ ప్రభుత్వం ఆక్వా రైతులకు ఒక్కో యూనిటుకు రూ.2/-లకు బదులుగా రూ.1.50/-లకే విద్యుత్తును అందిస్తుంది. ఇందుకోసం రూ.475 కోట్లను ప్రతిపాదిస్తున్నాను.

36. అదేవిధంగా, మన మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతును అందించేందుకు తూర్పుగోదావరిలోని ఉప్పాడలో, నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో, ప్రకాశం జిల్లా వాడరేవులో మరియు గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మేము ఫిషింగ్ జెట్టీలను అభివృద్ధి చేయాలని ఉద్దేశించాం. ఇందునిమిత్తం రూ.100 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

13