పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26. సాగు ఆదాయాలను పెంచేందుకు ప్రతి అవకాశాన్ని అన్వేషించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందువలన, స్థానిక పశువుల కోసం రూ.15,000/-లు, సంకరజాతి పశువులకు రూ.30,000/-ల రేటు చొప్పున పశువులకు బీమాను కల్పించడం ద్వారా పశువుల పెంపకానికి ఈ ప్రభుత్వం తగు ప్రాముఖ్యతనిస్తున్నది. ఈ ప్రయోజనం నిమిత్తం, రూ.50 కోట్ల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. అది 20 లక్షల పశువులకు వర్తిస్తుంది.

27. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెండింతలు పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు ఒక విధాన స్థాయిలో అన్ని చర్యలను చేపట్టేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎ) పెట్టుబడి మద్ధతును కల్పించడం బి) పరపతి, బీమా, సాగునీరు, శీతల గిడ్డంగి మున్నగువంటి ఇన్ పుట్ వ్యయాలను తగ్గించడం సి) ఇ-నామ్ ద్వారా ఆదాయాలను పెంచడం, అయినకాడికి అమ్ముకునే బాధను నియంత్రించేందుకు నిల్వ సామర్థ్యాన్ని కల్పించడం డి) ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా విపత్తులను తగ్గించడం మరియు ఇ) రైతు ఆత్మహత్యలు మరియు ప్రమాద మరణాల విషయంలో సహాయాన్ని అందించడం వంటివి ఇందులో కొన్ని చర్యలు.

28. రైతు భరోసాలో భాగంగా, ఉచితంగా బోరుబావులను త్రవ్వేందుకు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ ప్రకారంగా ఈ సంవత్సరంలో రూ.200 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించడమయింది.

29. వ్యవసాయ కార్యకలాపాలను సమర్ధవంతంగా కొనసాగించటంలో, వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర సరకుల రవాణాలో మోటారు వాహనాల లభ్యత చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ట్రాక్టర్లు వినియోగం కోసం రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ట్రాక్టర్లకు రోడ్ టోల్ మినహాయింపును కల్పించింది.

30. మన రైతులు నాణ్యమైన ఉపకారాలతో ఉత్పాదకతను పెంచుకునేటట్లు, అంతేకాకుండా యోగ్యతలేని వర్తకుల నుండి రైతులను కాపాడేటట్లు చూడటానికి, ఈ ప్రభుత్వం భూసారం, విత్తనం, ఎరువులు, పురుగు మందులను పరీక్షించే సదుపాయాలతో వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందునిమిత్తం, బడ్జెటులో రూ.109.28 కోట్ల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

11