పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23. వైఎస్ఆర్ రైతు భరోసా : మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంట కాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరం రూ.12,500/-లు పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని ప్రతిపాదించాం. మన ముఖ్యమంత్రిగారు మే నెల చివరలో ప్రమాణ స్వీకారం చేసారు. దయనీయమైన ఆర్థిక స్థితిని ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమయింది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, ఎక్కువమంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ, మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయనకు గల నిబద్ధతకు ప్రతీకగా 15, అక్టోబరు 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. రూ.8,750 కోట్ల పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64.06 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ఇందులో 15.36 లక్షల మంది కౌలు రైతులూ ఉన్నారు. సాగు పెట్టుబడి మద్ధతు కోసం కౌలు రైతులను అరులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదేనని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.

24. వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలు : రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు, కౌలు రైతులకు ఇచ్చిన వాటితో సహా ఈ ప్రభుత్వం రైతుల కోసం వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలను అమలు చేస్తున్నది. ఈ ప్రయోజనం కోసం ఈ బడ్జెటులో నామమాత్రపు రూ. 100 కోట్లను ప్రతిపాదిస్తున్నాను.

రైతుకు పంట ప్రాణం.
పంటకు వాతావరణం ప్రాణం.
పంట రాకపోతే రైతు తట్టుకోలేడు.
వాతావరణం సరిగా లేక పోతే పంట తట్టుకోలేదు.
అంటే....
పంటకు బీమా కావాలి. బీమాతోనే రైతుకు ధీమా వస్తుంది.

25. వైఎస్ఆర్ పంటల బీమా - వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన : రైతుల సంక్షేమమనే ఈ భావనకు కొనసాగింపుగా, పంటల బీమాలో భారాన్ని వారికి తొలగిస్తూ రైతుల యొక్క పంటల బీమా ప్రస్తుత వాటాను చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 1,163 కోట్ల బడ్జెటును కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దీనివలన 60.02 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

10