పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంది వాలంటీర్లను మోహరించటం ద్వారా ప్రభుత్వం గ్రామ స్థాయిలో పాలనా వ్యవస్థను మరింత పటిష్టపరచింది. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న 536 రకాల సేవలను ఈ సచివాలయాల ద్వారా ప్రజలు తమ ఇంటి గుమ్మం దగ్గరే అందుకోగలుగుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సచివాలయముల ద్వారా మరిన్ని సేవలను అందించడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతుంది.

13. మూడవది. ఉత్పత్తి శక్తులను మరింత సార్థకంగా వినియోగించుకోవటం, వివిధ రంగాల్లో ఉత్పాదకత పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం ఈ వార్షిక బడ్జెటు తాలూకు ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. సరిగ్గా ఈ కారణం వలననే అన్నదాత లైన మన రైతులు మొదటి ప్రాధాన్యతను పొందుతున్నారు. 'రైతు భరోసా' ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని గణనీయంగా అందించడం ద్వారా ప్రాథమిక రంగానికి మూలాలు చేకూర్చటం ఈ దిశగా వేస్తున్న ముఖ్యమైన అడుగు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన, ఋణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం, పారిశ్రామిక రంగంలో మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు సముచితమైన ప్రోత్సాహకాలు మొదలైన వాటి ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించబోతున్నాం.

14. నాలుగవది. మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం వలన సాధించగల బహుళార్ధ ప్రయోజనాలను మనమెవ్వరం కాదనలేం. మానవ వనరులు, వస్తువుల తయారీ, సేవలు తదితర రంగాలు ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి చెందినా వాటికి నాణ్యమైన మౌలిక సదుపాయాలే పునాది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అలాగే దుర్భిక్ష నివారణను సాధ్యం చేయగల కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడానికి చర్యలు తీసుకున్నది. అదే సమయంలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నాణ్యమైన విద్యుత్తు సరఫరాను అందించే లక్ష్యంతో విద్యుత్తు రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల రాబోయే లాభాలను మరింత పటిష్ట పరిచే ప్రతిపాదన చేస్తున్నాము.

6