పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రారంభించబోతున్నది. కాన్సర్, మూత్రపిండ సంబంధిత సమస్యల చికిత్స మీద ప్రత్యేక శ్రద్ధతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా 'నాడు నేడు' పథకం కింద చేపట్టనున్నది. ఈ పథకం కింద మొత్తం 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 ప్రాంతీయ వైద్యశాలలు, 13 జిల్లా ఆసుషత్రులు, 11 బోధన ఆసుషత్రులలో మౌలిక సదుపాయాలు ఆధునీకరించబడనున్నాయి. ఇందుకు గాను వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలన్నింటిని నింపడానికీ, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో సేవలను మరింత బలోపేతం చేయడానికీ 9,700 మంది ఆరోగ్య సిబ్బందిని నియమించబోతున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టబోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం .

30. ఇందుకు గాను ఆరోగ్యశాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11,419.44 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయం

థామస్ జెఫర్ సన్ చెప్పిన ఈ మాటలు సుప్రసిద్ధం. ఆయన ఇలా అన్నారు:

'మనం చేపట్టే పనులలో వ్యవసాయం అన్నిటికన్నా ఎంతో వివేకవంతమైంది. ఎందుకంటే అది మనకి నిజమైన సంపదనీ, విలువలనీ, సంతోషాన్ని ఇస్తుంది'

'పండించేవాడు పస్తుంటే పరమాత్మకూ పస్తే' అంటారు

అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటించ కూడదని లక్ష్యంగా నిర్దేశించుకుని మా ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. లాభాలొస్తున్నాయా లేదా అన్న లెక్కా-పత్రాలతో సంబంధం లేకుండా రైతన్న ఆరుగాలం సేద్యాన్నే నమ్ముకొని కష్టపడుతున్న ఫలితంగానే ఆహార భద్రత సాధ్యమైంది. మరి రైతు భద్రత మాత్రం దశాబ్దాలుగా ఎండమావిగానే మిగిలింది.

12