పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య, ఈ వర్గానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు IIT లు, NIT లు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలలలో ప్రవేశం పొందారు. ఇంతేకాక, పూర్తి ఆర్థిక సహాయంతో, కెన్నెడీ లుగర్-యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం మరియు విద్యా కార్యక్రమాల క్రింద ఎనిమిది మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్ జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు.

గిరిజన సంక్షేమం

87. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, 2019 సంవత్సరము జూన్ నెల నుండి ఇప్పటి వరకు, 2,19,763 ఎకరాలకు గాను 1,29,842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక, గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39,272 ఎకరాలకు 26,287 డీ.కే.టి. పట్టాలు పంపిణీ చేయబడ్డాయి.

88. షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్ ను నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి, మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపచేసి, పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది.

బీసీ సంక్షేమం

89. మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం, మా ప్రభుత్వం గత ఐదేళ్లలో వివిధ కార్యక్రమాలు, పథకాల క్రింద 1 కోటి 2 లక్షల మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

23