పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యవసాయ సమగ్ర వ్యూహంలో భాగముగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము, పంటల బీమా, పంటసాగు నిర్వహణ, మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడము వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడూ లేని విధంగా లాభసాటిగా మారుస్తోంది.

ఉద్యాన వన రంగము

57. మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని 17 లక్షల 27 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలను అందించింది. ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి, 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాలలో నియమించాము. రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకొనేదాకా పంటను నిల్వ చేసుకోవటానికి తద్వారా, పంట అనంతర నష్టాలను నివారించడానికి 2 లక్షల 44 వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్ లను ఏర్పాటు చేయటమైనది.

పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి

58. జగనన్న పాల వెల్లువ పథకము పాడి రైతులకు లీటరుకు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరలను పొందేందుకు సహాయపడింది. అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ చర్యలు వలన 5,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.

59. వై.ఎస్.ఆర్. పశు భీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యము కల్పించబడింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతులకు వారి ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుంది.

16