పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10,574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని 1 కోటి 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది.

39. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61 శాతం ఉండగా, మా ప్రభుత్వం దానిని 4 శాతం కంటే తక్కువకు తగ్గించి, దేశంలోనే గుర్తించ దగిన ఘనతను సాధించింది.

నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ

19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటలలో...

"నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన
అనుభవం, బుద్ధి మరియు ఆసక్తిల సమ్మేళనం”

40. పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది. పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది. విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వ విద్యాలయము, కళాశాలలు మరియు హబ్ లతో కూడిన క్యాస్కేడింగ్ స్కిల్ ఎకో సిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. ఇప్పటివరకు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్ లు మరియు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించటం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరము లో 21 రంగాలలో లక్షా 6 వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95 శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారు.

11