పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోధనా ఆసుపత్రులు వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. అంతే కాక 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు రెండు షిఫ్ట్ లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి.

34. ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టరు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో, 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకుని రావటం జరిగింది.

35. ఫ్యామిలీ డాక్టరు సేవలతో పాటు, మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108–అంబులెన్స్ సర్వీసులను మరియు 104-సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయటం జరిగింది.

36. డా॥ వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయ అర్హత పరిమితి 2 లక్షల 50 వేల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 1,059 వ్యాధుల సంఖ్య నుండి 3,257 వ్యాధులకు పెంచుతూ, హైదరాబాదు, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ వలన 2014-19 మధ్యకాలంలో 13 లక్షల 82 వేల మంది ఈ పథకం క్రింద లబ్ధిపొందగా, 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35 లక్షల 91 వేలకు పెరిగింది. అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పోరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి 200 పడకల డా॥ వై.ఎస్.ఆర్. కిడ్నీ రీసర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, పలాసలో స్థాపించబడింది.

37. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకం క్రింద శస్త్రచికిత్స అనంతర జీవనోపాధి భత్యంగా రోజుకు 225 రూపాయలు అందించబడుతుంది. డిసెంబర్ 2019 నుండి ఈ పథకం క్రింద 25 లక్షల మంది రోగులకుగాను 1,366 కోట్ల రూపాయలు అందించాము.

10