పుట:ఆంధ్రపదనిధానము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకృతగ్రంథమగు నాంధ్రపదనిధానమునుగూర్చి కొంచెము చెప్పవలసియున్నది. ఈ గ్రంథమును కవి నలువదవయేట వ్రాయనారంభించి, మరణకాలమునకుఁ గొంచెమించుమించుగఁ బూర్తి గావించెను. నిఘంటువునకు వలయు పదసముదాయమును శబ్దరత్నాకరమను అకారాదినిఘంటువునుండి గైకొని వర్గీకరణ మొనరించి పద్యములు గావించెను. సమగ్రమగు శబ్దరత్నాకరమున నున్న పదముల వర్గానుసారముగఁ దొలుత వ్రాసికొన్న చిత్తుప్రతులను మొదట వ్రాసిన పద్యప్రతులు దాని ననుసరించి వ్రాసినశుద్ధప్రతియుఁ గవికుటుంబమున నేటికిని భద్రపఱుపఁబడియున్నవి. కవిశుద్ధప్రతి మరలఁ బరిశోధింపమిచేఁ బలుతావుల దోషములు కలవు. మ్యూడవకాండమునందు దాదాపుగ మూఁడుభాగముల కర్థము వ్రాయలేదు, మాకు లభించిన మాతృకలోఁ జివరభాగము చెదపుర్వులు దినివేసెను. అందుచేఁ గొన్ని పద్యములకు మొదలు, కొన్నిపద్యముల కర్ధము, మేము సమకూర్చితిమి. అర్థమునుబట్టి పద్యభాగము, పద్యభాగమునుబట్టి యర్థము వ్రాసియుంటిమి గాన దాదాపుగ నీసంస్కరణము కవిభావము ననుసరించి చేసియుందుమని మా విశ్వాసము. అందుచేఁ గుండలీకరణము మానితిమి.

సంస్కృతమున వర్గీకరణరూపముననున్న నిఘంటువు లెన్నియో గలవు. నామలింగానుశాసనము, మేదిని, విశ్వము, నానార్థరత్న మున్నగు నుపలభ్యములగునవియే గాక నింక నెన్నియో యున్నట్లు వ్యాఖ్యాతల యుదాహృతభాగములవలన నెఱుంగ నగును. ఆంధ్రమున బద్యనిఘంటువులు చాలయరుదుగా నున్నవి. అందు

  1. ఆంధ్రభాషార్ణవము పద్యసంఖ్య 624
  2. ఆంద్రనామసంగ్రహము పద్యసంఖ్య 209
  3. ఆంధ్రనామశేషము పద్యసంఖ్య 100
  4. సాంబనిఘంటువు పద్యసంఖ్య 95
  5. వెంకటేశాంధ్రనిఘంటువు పద్యసంఖ్య 100

మాత్రము ప్రకృత ముపలభ్యములు. నామలింగానుశాసనమువలె వర్గీకరణ మొనరించిన కోటి వెంగనార్యుని ఆంధ్రభాషార్ణవము సర్వవిధముల బ్రశస్తతరము. ఆంధ్రనిఘంటువులో బ్రథమము ప్రథమగణ్యమునగు నీయాంధ్రభాషాభూషణమునకు ఆంధ్రనామసంగ్రహమున కున్నంతయేని వ్యాప్తి లేకుండుటకుఁ గారణము చింత్యము. వర్గీకరణమున సాదృశ్యముంటచేతను గ్రంథప్రశస్తి