పుట:ఆంధ్రపదనిధానము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  1. మిత్రవిందోద్వాహము ప్రబంధము
  2. కాళిదాసునాటకము
  3. ఆంధ్రపదనిధానము

రుక్మిణీకల్యాణము బాల్యావస్థలో రచించిన దగుటచే నంతప్రౌఢముగ లేదు. కవియే యాగ్రంథమునెడు శ్రద్ధ గైకొననందున నెన్నఁడో నశించినది. గోపీకావిలాసము పుష్పబాణవిలాసములోని శృంగారలీలల శ్రీకృష్ణున కన్వయింపఁజేసి వ్రాసిన పద్యకావ్యము. ఇందలి పద్యములు మిత్రవిందోద్వాహములోఁ గవి జేర్చుకొనినాఁడు. మధ్యకాలములో నీగ్రంధము మరుగుపడినది. ఇపు డెంత వెదకినను గనుపింపలేదు. కాళిదాసనాటకము ప్రకృతరంగస్థలముల కనుకూలను:గ నిక్కవి సురభికంపినివారిప్రార్థనపయి మూఁడుదినములలో రచించి రంగస్థలమునఁ బ్రదర్శింపఁజేసినాడు. ఆ కాలమున సురభికంపినీవారు ప్రదర్శించు విలువగల నాటకములలో నీ కాళిదాసనాటక మొకటి. క్రీ.శ. 1839లో కాళిదాసనాటకము ముద్రిత మైనది. ఇప్పు డొకప్రతి స్థానికగ్రంథాలయములో నుండఁగ మేము చూచినారము. మిత్రవిందోద్వాహము ముద్రితమెగాని ప్రతులు లభించుటలేదు. ఇది యైదాశ్వాసముల శృంగారకావ్యము. నిర్వచనము. గర్భకవితయు బంధకవితయు శబ్దాలంకారములు గలప్రబంధము. ప్రకృతమగు ఆంధ్రపదనిధానము తుదిగ్రంథము.

ఈకవి ప్రారంభమునఁ గొంతకాలము నిజాముదొరతనమువారి యటవీశాఖలో నుద్యోగిగా నుండి యది విరమించుకొని ఒరంగల్లు మండలములోని ఆత్మకూరు సంస్థానమున వెంకటనరసయ్య దేశాయిగారియొద్ద రాజకీయవ్యవహర్తగ బ్రవేశించెను. కవి స్వరూపపట మెన్నివిధముల యత్నించినను లభింపలేదు.

రామదాసకవికి ప్రతాపపురం రంగాచార్యులవాగు విద్యాగురువు. కాంచివాస్తవ్యులు షట్ఛాస్త్రవేత్తలు నగుకందాళ సింగరాచార్యులవారు పంచసంస్కారప్రదాతయగు కులగురువు. విద్యాగురువగు రంగాచార్యులవా రీయాంధ్రపదనిధానము మూఁడవకాండము ముద్రించువఱకు సజీవులై యుండిరి. కవిజీవితమునకు వలయు నంశములు నెన్నియేని చెప్పుదుమని వాగ్దానము గావించిరి. గ్రంథముద్రణాంతరము వారితో సంప్రదింపవచ్చు ననుకొన నీసంవత్సరము వర్షకాలమున నాకస్మికముగ స్వర్గస్థులైరి. ఆంధ్రవిద్యార్థిలోకమున కందుచే విపులజీవితచరిత్రము నివేదింపలేకపోతిమి.