పుట:ఆంధ్రపదనిధానము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

ఆంధ్రకవుల గ్రంథములలోఁ బెక్కు నశించినవి. కేవలప్రాచీనకవులగ్రంథములు ప్రత్యంతరరూపమున వ్యాప్తి చెందినకతన నేఁడుగాకున్న మఱికొంతకాలమునకేని లభింపవచ్చును. ఆధునికకవుల గ్రంథములస్థితి శోచనీయముగ నున్నది. ముద్రణ మలభ్యమైన కాలమునఁ గలకవులు గ్రంథరచన మొనరించి ప్రత్యంతరములఁ దమయింట భద్రపఱచి గతించిరి. వానికి లోకమున వ్యాప్తి లేదు. వంశీయులు ప్రచురింపరు. లోకులకు వాని యునికియె తెలియదు. ఈ యజ్ఞాతావస్థలో విలువగల గ్రంథములు నశించుచున్నవి. అట్లు నశింప నున్ముఖమైన పుస్తకములలో నీయాంధ్రపదనిధాన మొకటి.

గ్రంధకర్త తూము రామదాసకవి. ఈయన జీవితచరిత్రమును గ్రహింపఁదగిన వివరములు కృత్యాదియందు లేవు. వాధూలగోత్రజులగు సింగరాచార్యుల శిష్యుఁడనియు రంగాచార్యులకు మిత్రుఁడనియు మాత్రము కృత్యాదియందలి యైదవపద్యమువలన గ్రహింపవచ్చును. బాలనరేశుఁ డగువిష్ణుమూర్తి కృతిభర్త. ఈవివరములు జీవితచరిత్రసంగ్రహమునకుఁ జాలవు. కవి కుమారులవద్దనుండి సంగ్రహించిన యంశముల ననుసరించి జీవితము వ్రాయుచున్నారము.

తూము రామదాసకవి కాపుకులజుఁడు. పూర్వమునుండియు నివాసము ఒరంగల్లు. పకృతము ఒరంగల్లులోని యొకభాగముగు బాలనగరమున వీరిగృహము కలదు. పసుపునూళ్ళగోత్రము. ఈయన జననకాలము గడచిన నలసంవత్సర శ్రావణబహుళ ద్వితీయ సోమవారము (క్రీ.శ. 18-8-1856), మరణకాలము గ్రోధి సం॥ కార్తీక బహుళసప్తమి (క్రీ.శ. 29-11-1904). జీవితకాలము దాదాపు 49 సంవత్సరములు. ఇరువదియొకటవయేటఁ గవితారచనమున కారంభించినాఁడు. కవితారంభకాలము ధాతసంవత్సరము కానోపు. కవి పంచసంస్కారములఁ బడిసిన వైష్ణవమతస్థుడు.

ఈరామదాసకవి ఒరంగల్లునివాసియు సరసకవితావిశారదుఁడు వైదుష్యభూషణుఁడునగు ప్రతాపపురము రంగాచార్యులగారివద్ద సంస్కృతాంధ్రముల నభ్యశించి ఈక్రిందిగ్రంథరాజములను గ్రమానుసారముగా రచించెను.

  1. రుక్మిణీకల్యాణము గేయగ్రంథము
  2. గోపికావిలాసము ప్రబంధము