పుట:ఆంధ్రపదనిధానము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరకు బయలు వెడలినవి. అందు ఆంధ్రనగరమని పేరొందిన ఒరంగల్లు ఆంధ్రకావ్యరత్నములకు ఖని. భాస్కరరామాయణ భాగవత సీతారామాంజనేయాది గ్రంథరత్నముల కీఖనియే మాతృస్థానము. అదృష్టవశమునను ఆంధ్రపరిశోధకుల సుకృతవశమునను లభించిన కోహినూరు రత్న మీయాంధ్రపదనిధానము. ప్రకృతిసిద్ధమగు నీదివ్యరత్నమునకు సంక్రమించిన స్వల్పదోషముల సంస్కరించి మెఱుఁగుబెట్ట నవకాశ మొదివిన మే మెంతయు ధన్యులము.

రామదాసకవి యీ నిఘంటువును బూర్తిచేసి చివరకాండమును సంస్కరించి టీక వ్రాయనారంభించి రాచపుండుచే బాధ నొంది యచిరకాలమున స్వర్గస్థుఁ డగుటచే నూతనసంస్కరణము తృతీయకాండమునందు విశేషించి జరుపవలసివచ్చినది. ఓరంగల్లులోని దర్శనీయప్రదేశములలో స్మారకచిహ్న మనదగు రామదాసకవిసమాధి యొకటి. ఇది బౌలనగిరి సమీపముగా నున్నది.

ఆంధ్రనగరమని ప్రసిద్ధి వహించిన ఒరంగల్లుమండలమున గ్రంథపరిశోధనము శాసనపరిశోధనము జరుపుతరుణమునఁ గొన్నిదినములు ఒరంగల్లున నివసించితిమి. స్థానికులును శబ్దానుశాసనగ్రంథాలయస్థాపకులును సౌజన్యభావులు నగు తూము వరదరాజులుగారికి మాకు నవ్యాజమగుస్నేహము కుదిరెను. వారు మాయుద్యమమును దమయన్నగారును ధర్మస్వభావులును న్యాయవాదులు నగు తూము రంగయ్యగారికిఁ జెప్పి పరిశోధనోద్యమందున మాకు నెంతేనిసాయంబు చేయించిరి. అనఁతర మొకదినమున మీమింట నేమేమి ప్రాచీనగ్రంథములు గలవా యని ప్రశ్నించ తమతండ్రియగు రామదాస కృత్రగంథపేటిక మాముందు పెట్టిరి. జీర్ణాతిజీర్ణములగు నాగ్రంథములనుండి పుస్తకాకారగముగనున్న యీయాంధ్రపదనిధానమును వెలికిఁదీసి పరిశీలించితిమి.

గ్రంధకర్తకుమారులగు తూము రంగయ్యగారు మాప్రోత్సాహమున కామోదిఁచి యాంధ్రభాషోపకారముగ ఆంధ్రపదనిధానమును ముద్రించుటకు వలయునంతధనము నొసఁగి ముద్రణభారము గ్రంథసంస్కరణభారము మాతలపయి బెట్టి చివికి జీర్ణమైయున్న కాకితములకట్టను సంస్కరించి శుద్ధప్రతి వ్రాసి నాలుగుసంవత్సరములు తీవ్రకృషి చేసి గ్రంథరూపముగ నీయాంధ్రపదనిధానము నాంధ్రలోకమునకు సమర్పింపఁగలిగితిమి.

మే మొకతావునను ముద్రణాలయము వేఱొకతావునను నుంటచే నెన్నివిధముల బరిశీలించినను దోషములు దొరలినవి. ద్వితీయముద్రణమున కవకాశము లభించినచో నిర్దుష్టతరముగ నీగ్రంథమును బరిష్కరింపఁగలము.