పుట:ఆంధ్రపదనిధానము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లింగానుశాసనముతో బోల్కి యున్నను నిందు విశేషించి యందులేని పర్యాయపదములు గలవు. ఒక్కస్వర్గవర్గు దిలకించిన నమరమున లేని నారదుఁడు, కృష్ణుఁడు, నృసింహుఁడు, సీత, వెంకటేశుఁడు మున్నగువేల్పులకు బర్యాయపదములు గోచరించును. ఇట్లే యీయాంధ్రనిఘంటువున బ్రతివర్గమున విశేషాంశము లున్నవి.

బహుజనపల్లి సీతారామాచార్యులవారు శబ్దరత్నాకరపీఠికలో తెనుఁగునిఘఁటువులయందుండి పదములను మాత్ర మెత్తి వ్రాసికొని యర్థము లందలివి తఱుచుగ లక్ష్యవిరుద్ధములుగ నుంటచే లక్ష్యశోధనంబు గావించితి అని పూర్వోక్తనిఘంటువులపయి నొకదోష మారోపించిరి. వాఙ్మయము గావించినవారినుడి యెంతయేని సత్యము. సుపరిశోధితమగు శబ్దరత్నాకరము ననుసరించి వ్రాయబడినది గావున నీయాంధ్రపదనిధానమున కట్టిదోష మారోపింపఁ దావులేదు. కాన నిది యింతవఱకు బయలువెడలిన యన్నినిఘంటువులకంటె సమగ్ర మనియు విశేషపదావృత మనియు శబ్దరత్నాకరముెలే ప్రమాణభూత మనియు జెప్పవచ్చును.

ఇందు నామలింగానుశాసనమువలెఁ గాండములు వర్గములు విభజింపఁబడినవి. లింగాదిసంగ్రహవర్గము మాత్రము తెనుఁగున విడువఁబడినది. ఆంధ్రమున లింగాదిసంగ్రహవర్గము గూర్ప నవకాశములు లేవనియు నేకొన్నిపదములకో యీనిర్ణయము జేసినను నీవర్గమువలన నంతగా నుపయోగ ముండదనియుఁ గవి మానియుండును. మిగిలిన వర్గములన్నియు నామలింగానుసారముగ నున్నవి.

ఆంధ్రపదనిధానము 1565 పద్యములు గల యుద్గ్రంథము. శబ్దరత్నాకరస్థములగు పదములెగాక నిజామురాష్ట్రమున వ్యవహరింపబడు దేశ్యపదములు సైత మిందు జేర్పఁబడినవి కొన్ని కొన్ని వర్గములందు అమరముకంటెఁ బదసముదాయము విస్తరముగఁ గలదు. అమరమునందులేని పనిముట్టులపేరులు జాతీయవాచకములు వస్తునామములు నీకవి స్వయముగఁ బరిశోధించి సమకూర్చియుఁ గొన్నితావుల సంస్కృతపదముల వ్యుత్పత్తిభావాదుల గమనించి యాంధ్రపదములను గల్పించియు గ్రంథాంతరములనున్న దేశ్యపదములను గూర్చియు నీగ్రంథమునఁ బదసముదాయమును బెంపొందించియున్నాఁడు. అందుచే నీనిఘంటువు ఆంధ్రలోకమునకుఁ బరమోపకార మనియు